AP Assembly : శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల - వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని వల్లకాడు చేశారన్న సీఎం చంద్రబాబు
AP Assembly Session Updates: రాష్ట్రంలోని ‘శాంతి భద్రతల’పై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు.
AP Assembly Session Updates: ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు… రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్యాయంగా, అక్రమంగా నేతలపై కేసులు నమోదు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికైన 80 శాతం ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయని గుర్తు చేశారు.
ఫర్నిచర్ సాకుగా చూపించి కోడెల శివప్రసాద్ ఫేకు వార్తలు వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన్ని అవమానించి, వేధించి, బలవంతంగా చనిపోయేలా చేశారని ఆరోపించారు. “ఇప్పుడు జగన్ రెడ్డిని అడుగుతున్నా.. ఇప్పటికీ నువ్వు ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు. నీ సంగతి ఏంటి అని అడుగుతున్నా” అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా, అశోక గజపతి రాజు, అచెన్నాయుడు, నారాయణ, రఘురామరాజు.. ఇలా ఏ నేతని కూడా వదిలి పెట్టలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామరాజు ఎంపీగా ఉంటూ, 5 ఏళ్ళు తన నియోజకవర్గానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.
వైసీపీ హయాంలో తన ఇంటి పైన దాడి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులు తగలబెట్టారని… అదేమని అడిగితే, భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నారని దుయ్యబట్టారు. నాటి పాలనలో జరిగిన ఘోరాలు అంటూ సభలో వీడియోలను ప్రదర్శించారు.
ఇక సభలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. దీంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం ఎమ్మెల్యేలు నిల్చున్నారు.
2019-2024 మధ్య ఏ వ్యవస్థని వదల లేదని చంద్రబాబు ఆరోపించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా విభాగాల పై దాడి చేశారన్న ఆయన… మొత్తం పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి పడేసారని అన్నారు. విద్వేషం, విధ్వంసం, అవినీతి, అసమర్ధతతో రాష్ట్రాన్ని వల్లకాడు చేశారని వ్యాఖ్యానించారు.
ఏ నాడు కేసు లేని తనపైన 17 అక్రమ కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు గుర్తు చేశారు. చివరకు శాసనసభలో కూడా చేయకూడని పనులు చేశారని… పవన్ కళ్యాణ్ ను కనీసం పరామర్శకు కూడా వెళ్ళనివ్వలేదని చెప్పారు.
గూండాలని, రౌడీలని, ఫ్యాక్షనిస్టులని, మతకలహాలు చేసే వారిని అరికట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని చంద్రబాబు గుర్తు చేశారు. 2014-2019 మధ్య నేరాలు తగ్గాయన్న ఆయన… సాంకేతికత ఉపయోగించి, లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టగలిగామని చెప్పుకొచ్చారు.
తోట చంద్రయ్య పీకపై కత్తి పెట్టి… జై "సైకో" అనమంటే, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడని చంద్రబాబు సభలో గుర్తు చేశారు. “మీ పార్టీ కార్యకర్తలు గంజాయి మత్తులో నరుక్కుంటే ఢిల్లీకి వెళ్లి గోల చేశావే... నీ పాలనలో ఇంత మందిని చంపించావ్, ఏనాడైనా కనీసం ఒక్క సమీక్ష చేశావా..?” అంటూ జగన్ ను నిలదీశారు. గత ప్రభుత్వంలో నమోదైన కేసులతో పాటు దాడి ఘటన దృశ్యాలను సభలో ప్రదర్శించారు.