Kodela Statue Issue: బకాయిల కోసం సత్తెనపల్లిలో కోడెల విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్తులు
Kodela Statue Issue: సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ ఉద్రిక్తంగా మారింది. కోడెల తనయుడు శివరామ్ తమకు డబ్బు బకాయి పడ్డారని ఆరోపిస్తూ బాధితులు విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు.
Kodela Statue Issue: సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల తనయుడికి నిరసన సెగ తగిలింది. సత్తెనపల్లి నియోజక వర్గం ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామంలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటూ గ్రామానికి చెందిన ఓ వర్గం ఆందోళనకు దిగింది.
తమ దగ్గర అరవై లక్షల డబ్బు తీసుకుని ఐదేళ్లుగా సమాధానం చెప్పడం లేదని విగ్రహం ఎదుట బైఠాయించిన బాధితులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి నియోజక వర్గంలో ఇటీవల ఇంఛార్జిగా మాజీ మంత్రి కన్నాకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. దానిపై కోడెల శివరామ్ భగ్గుమన్నారు. టీడీపీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడున్నరేళ్లుగా తనను అవమానిస్తున్నారని, చంద్రబాబును కలిసేందుకు కనీసం అవకాశం ఇవ్వట్లేదని ఆరోపణలు చేశారు.
దీంతో జిల్లా అధ్యక్షుడు జివి.ఆంజనేయులు కోడెల తనయుడిని బుజ్జగించారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సర్ది చెప్పారు. దీంతో కోడెల శివరామ్ నెమ్మదించారు.మరోవైపు నియోజకవర్గంలో శివప్రసాద్ విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. రుద్రవరం గ్రామంలో విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. గురువారం సాయంత్రం గ్రామంలో విగ్రహావిష్కరణకు కోడెల శివరామ్ వర్గీయులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు కోడెలశివరామ్ తమకు డబ్బులు చెల్లించే వరకు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీల్లేదంటూ బాధితులు విగ్రహం ఎదుట బైఠాయించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసు బలగాలు మొహరించాయి.
ఆర్ధిక వ్యవహారాలపై సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సత్తెనపల్లి బాధితులకు డిఎస్పీసూచించారు. బాధితులు మాత్రం తమకు డబ్బులు చెల్లించకుండా విగ్రహ ఆవిష్కరణ చేయడానికి వీల్లేదని తేల్చి చెబుతున్నారు. నాలుగేళ్లుగా తీసుకున్న డబ్బు చెల్లించకుండా వేధిస్తున్నారని వాపోయారు. తమకు రావాల్సిన డబ్బు ఇవ్వకపోతే కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతామని చెబుతున్నారు. గ్రామంలో ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.