Mohan Babu Land Issue : మోహన్ బాబు మనుషులు కత్తులతో హల్ చల్ చేశారు- రంగంపేట ఎంపీటీసీ, గ్రామస్థుల ఆరోపణలు
Mohan Babu Land Issue : నటుడు మోహన్ బాబు స్థల వివాదంతో... కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని రంగంపేట గ్రామస్థులు, ఎంపీటీసీ ఆరోపించారు. యూనివర్సిటీ డంపింగ్ యార్డుకు స్థలం ఇవ్వనందుకే దాడికి ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Mohan Babu Land Issue : టాలీవుడ్ అగ్ర నటుడు మోహన్ బాబు అనుచరులు తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని రంగంపేట ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి మారుతి నగర్ లో ఉంటున్న ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డిని హత్య చేసేందుకు ఆరుగురు దుండగులు యత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. వారిలో ఒకడిని పట్టుకున్న బోస్ చంద్రారెడ్డి అనుచరులు పోలీసులకు అప్పగించారు. చిత్తూరు జిల్లా రంగంపేట గ్రామస్థులు, నటుడు మోహన్ బాబు మధ్య స్థలం వివాదం నెలకొంది. ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనీష్‌లపై మోహన్ బాబు అనుచరులు దాడి చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి రంగంపేటలో ఆరుగురు దుండగులు పెట్రోల్ క్యాన్‌లు, కత్తులు, కర్రలతో హల్‌చల్ చేశారని రంగంపేట గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వీరిలో హేమంత్ అనే ఓ యువకుడ్ని పట్టుకొన్న గ్రామస్థులు.. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
దాడికి పాల్పడిన యువకుడు అరెస్ట్
మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్వో సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి నిందితులకు ఫొటోలు పంపించి రూ.3 వేలు ఫోన్ పే ద్వారా దాడి చేయాలని చెప్పారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో చంద్రగిరి పోలీసులు రంగంపేట చేరుకుని నిందితుడు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కర్రలు, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినీనటుడు మోహన్ బాబు, పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల మాకు ప్రాణహాని ఉందని ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ ఆరోపించారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని బోస్ చంద్రారెడ్డి కోరుతున్నారు. రంగంపేట కూడలిలో రంగపేట గ్రామస్థులు, బాధితులు ధర్నా చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు నశించాలని, మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాు చేశారు.
భూమి దక్కదనే దాడి
ఈ ఘటనపై ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యానికేతన్ సంస్థల డంపింగ్ యార్డు కోసం మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే గ్రామస్థులు స్థలం ఇచ్చేందుకు నిరాకరించారని, గ్రామ సభలో స్థలం ఇవ్వకూడదని తీర్మానం చేశారన్నారు. 35 సెంట్లు భూమిపై మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వాహకులు కన్నేశారని ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి ఆరోపించారు. 2023 ఫిబ్రవరిలో సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించామన్నారు. దీంతో అప్పటి నుంచి తమపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఓసారి దాడికి ప్రయత్నించారన్నారు. అప్పుడే ఫిర్యాదు చేయాలని భావిస్తే గ్రామపెద్దలు చెప్పడంతో వెనక్కి తగ్గామని తెలిపారు. ఆ స్థలంలో పనులు జరుగుతున్నాయని అనుమానం రావడంతో గుణశేఖర్ రెడ్డి పేరుతో అదే సర్వే నంబర్‌పై సమాచార హక్కు చట్టం కింద వివరాలకు అప్లై చేశామన్నారు. దీంతో ఆ భూములు తమకు దక్కవనే ఉద్దేశంతో మోహన్ బాబు మనుషులు తమపై దాడికి ప్రయత్నించారని ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి ఆరోపించారు.