Amanchi Joined Janasena : చీరాలలో వైసీపీకి షాక్, జనసేనలో చేరిన ఆమంచి సోదరుడు
Amanchi Joined Janasena : చీరాలలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేనలో జాయిన్ అయ్యారు.
Amanchi Joined Janasena : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో చెలరేగిపోతున్న పవన్... పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. వారాహి యాత్ర జోష్ తో జనసేనలోకి నేతలు క్యూకడుతున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు.. తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. తాజాగా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు... ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు... జనసేనలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చిన స్వాములు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. గతంలోనే ఆయన పవన్ కల్యాణ్ భేటీ అయ్యి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు. పవన్ కల్యాణ్ విధివిధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు స్వాములు తెలిపారు. జనసేన టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానన్నారు. పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయాలని కోరితే బరిలో నిలుస్తానన్నారు.
ఆమంచి సోదరుల రాజకీయమేనా?
బాపట్ల జిల్లా పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా...జనసేన శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోతో పాటు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు ఫొటో ఉండడం అప్పట్లో తీవ్ర సంచలనం అయింది. ఈ వార్తలు నిజం చేస్తూ ఆయన శనివారం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. చీరాలలో ఆమంచి సోదరులు కలిసే రాజకీయం చేసేవారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ కు వైసీపీ అధిష్ఠానం పర్చూరుకు ఇన్ ఛార్జ్ గా నియమించింది. చీరాల బాధ్యతులు.. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి చేరిన కరణం బలరాంకు అప్పగించారు. ఆమంచి సోదరుడు జనసేనలో చేరడం ఆసక్తికరంగా మారింది. ఆమంచి సోదరులు మాట్లాడుకునే.. తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు వెళ్లడం ఇష్టలేదని, కరణం బలరాంతో విభేదాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
చీరాలలో పట్టుకోసం
ఆమంచి సోదరుడు జనసేనలో చేరడంతో చీరాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే చీరాల సీటు కేటాయిస్తారనే నమ్మకంతో ఆమంచి స్వాములు వ్యూహాక్మతంగా జనసేనలో చేరినట్లు తెలుస్తోంది. కరణం బలరాం వైసీపీలో చేరడంతో... చీరాలలో ఆమంచి వర్గానికి ప్రాధాన్యత తగ్గిందని తెలుస్తోంది. కరణం బలరాంతో విభేదాలు కూడా మొదలవ్వడంతో వైసీపీ అధిష్ఠానం కల్పించుకుని ఆమంచిని పర్చూరుకు ఇన్ ఛార్జ్ గా నియమించింది. అయితే చీరాలలో పట్టుకోసం ఆమంచి, కరణం బలరాం వర్గాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది చీరాలలో రాజకీయాలు మారుతున్నాయి. ఆమంచి సోదరుడు స్వాములు జనసేనలో చేరారు. ఎన్నికల నాటికి ఏమైనా జరగొచ్చని ప్రచారం జరుగుతోంది.