CBN Chair: ఆ కుర్చీ మార్చండి, ఎన్డీఏ కూటమి సభలో చంద్రబాబు ఆదేశం..
CBN Chair: ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడి ఎంపిక కార్యక్రమంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేసేందుకు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించారు. వేదికపై చంద్రబాబు కుర్చీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో దానిని అప్పటికప్పుడు మార్పించారు.
CBN Chair: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభా పక్ష నాయకుడి ఎన్నిక కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసకుంది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమైన నాయకుల కోసం కుర్చీలను ఏర్పాటు చేశారు.
వేదికపై ఉన్న కుర్చీల్లో చంద్రబాబు కోసం ప్రత్యేకంగా పసుపు కండువాతో ఉన్న ఆఫీస్ ఛైర్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు కంటే ముందు వేదికపై వచ్చిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ కుర్చీకి అటు ఇటు ఆశీనులయ్యారు. మరో కుర్చీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూర్చున్నారు.
చివరిగా వేదికపైకి వచ్చిన చంద్రబాబు కుర్చీలో కూర్చోడానికి ముందే మిగిలిన కుర్చీలకు భిన్నంగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే సిఎస్‌ఓను పిలిచి తన కుర్చీ మార్చాలని ఆదేశించారు. మిగిలిన కుర్చీలకంటే ఎత్తులో ఉన్న ఆఫీసు చైర్‌లో కూర్చోవడం సముచితం కాదని భావించిన చంద్రబాబు దాని స్థానంలో మిగిలిన వాటి మాదిరి ఉన్న కుర్చీని ఏర్పాటు చేయాలని సూచించారు.
చంద్రబాబు సూచనతో సెక్యూరిటీ సిబ్బంది మరో కుర్చీని వేదికపైకి రప్పించారు. ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. టీడీపీ అధ్యక్షుడిగా తాను ప్రత్యేకమైన కుర్చీలో కూర్చుంటే మిగిలిన వారు నొచ్చుకునే అవకాశం ఉంటుందని, చూసే వారికి వేరే రకమైన సందేశాలు వెళ్తాయని భావించి చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరించారు. కూటమి తరపున సమావేశానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆసక్తిగా గమనించారు.
వేదికపై కుర్చీలను మార్చిన తర్వాత ఎన్డీఏ పక్ష నాయకుడిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బలపరిచారు. మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. చంద్రబాబును ఎన్నుకున్న తర్వాత చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం అచ్చన్నాయుడు, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌కు లేఖను అందచేశారు.