CM Chandrababu: బయటకు వెళ్లిన మార్గంలోనే శాసనసభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, జగన్‌ను కూడా గౌరవించాలని ఆదేశాలు-chandrababu ordered to enter the legislative assembly on the way out without protocol ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu: బయటకు వెళ్లిన మార్గంలోనే శాసనసభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, జగన్‌ను కూడా గౌరవించాలని ఆదేశాలు

CM Chandrababu: బయటకు వెళ్లిన మార్గంలోనే శాసనసభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, జగన్‌ను కూడా గౌరవించాలని ఆదేశాలు

Sarath chandra.B HT Telugu
Jun 21, 2024 10:52 AM IST

CM Chandrababu: రెండున్నరేళ్ల క్రితం ఏ సభ నుంచి అవమాన భారంతో నిష్క్రమించారో అదే మార్గంలో చంద్రబాబు నాయుడు తిరిగి శాసన సభలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతున్న చంద్రబాబు

CM Chandrababu: ఏ మార్గంలో బయటకు వెళ్లారో అదే మార్గంలో చంద్రబాబు శాసన సభలో అడుగుపెడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవేశం కోసం ప్రత్యేక మార్గం ఉన్నా ఎమ్మెల్యేలు ప్రవేశించే మార్గంలోనే లోపలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మూడున్నరేళ్ల క్రితం సభలో అవమానం తర్వాత శపథం చేసి బయటకు వచ్చిన దారిలోనే చంద్రబాబు తిరిగి సభలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

yearly horoscope entry point

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే లోపలకు రావాల్సి ఉంటుందని, ప్రోటోకాల్‌ ఉండకపోయినా జగన్ వాహనాన్ని లోపలకు అనుమతించాలని చంద్రబాబు ఆదేశించారని తమను శాసన సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి బయల్దేరే ముందు స్పష్టం చేశారని తెలిపారు.

చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని, శాసనసభలో రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని సిఎం చంద్రబాబు ఆదేశించారని, జగన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తమకు స్పష్టం చేశారని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారని పయ్యావుల వివరించారు. సిఎం, డిప్యూటీ సిఎం తర్వాత జగన్‌కు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్టు పయ్యావుల చెప్పారు.

మూడున్నరేళ్ల తర్వాత….

సీఎం చంద్రబాబునాయుడు సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2021 నవంబర్ 19న నిండు సభలో సవాలు చేసి సభ నుంచి నిష్క్రమించిన చంద్రబాబు ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి శాసన సభలోకి అడుగుపెట్టారు. అసెంబ్లీలో ప్రత్యర్థులు చేసిన రాజకీయ విమర్శలతో కలత చెంది సభను విడిచిపెట్టారు. శాసనసభలో వ్యక్తిగత దూషణలు, హేళనలు, వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులపై నిందలు, విమర్శలతో నలిగిపోయిన చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు.

శాసనసభను కౌరవ సభగా మార్చేశారని, మళ్లీ గౌరవ సభలోనే అడుగుపెడతానని నాడు సభలో సవాలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున 23మంది సభ్యులు గెలిచిన తర్వాత శాసనసభలో తెలుగుదేశం పార్టీని టార్గెట్‌గా చేసుకుని సభా కార్యక్రమాలు నడిపారనే విమర్శలు ఉన్నాయి.

శాసనసభలో టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యమిచ్చేవారు. ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే వ్యక్తిగత విమర్శలతో దాడి చేసేవారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును అధికార పార్టీ నేతలు అవమానించడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు సభలో అడుగుపెట్టనని సవాలు చేశారు.

2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో సీట్లను కట్టబెట్టారు. నాటి అధికార పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు.

నేడు సిఎం హోదాలో గౌరవంగా శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టనున్నారు. మళ్లీ సిఎంగానే సభకు వస్తాను అని 2021 నవంబర్ 19న సభలో శపథం చేసిన చంద్రబాబు అన్న ప్రకారమే మూడేళ్లుగా సభకు దూరంగా ఉన్నారు.

Whats_app_banner