NCBN Remand Extension: 24వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు-chandrababu naidus remand is extended for another three days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ncbn Remand Extension: 24వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

NCBN Remand Extension: 24వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Sep 22, 2023 11:10 AM IST

NCBN Remand Extension: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ మరో మూడు రోజులు పొడిగించారు. ఈ నెల 24వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్‌‌లో ఉంటారని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హిమబిందు ప్రకటించారు.

చంద్రబాబు అరెస్ట్ కేసు
చంద్రబాబు అరెస్ట్ కేసు

NCBN Remand Extension: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఈ నెల24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏసీబీ కోర్టు జడ్జి విచారించారు. మరో రెండు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంటారని వివరించారు.

చంద్రబాబుకు విధించిన రిమాండ్‌ గడువు ముగియడంతో ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బాబును విచారించారు. తనను అకారణంగా జైల్లో పెట్టారని బాబు న్యాయమూర్తికి తెలిపారు. నా బాధ, ఆవేదనంతా అదేనని చెప్పారు. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసన్న చంద్రబాబు వివరించారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానని జడ్జి తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని చంద్రబాబుకు జడ్జి బదులిచ్చారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. రిమాండ్ ను శిక్షగా భావించొద్దని, ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అన్నారు.

విచారణ సందర్భంగా రిమాండ్ లో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా అని చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు. ఎల్లుండి వరకు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారని, కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోందని, చంద్రబాబు తరఫున లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారని జడ్జి పేర్కొన్నారు.

మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై మరికాసేపట్లో ఏసీబీ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకోనుంది.ఐదు రోజుల పాటు సిఐడి కస్టడీ కోరుతోంది.దీనిని బాబు తరపున న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. కస్టడీ అవసరం లేదని వాదనలు వినిపించారు. మరోవైపు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు వెలువడక పోవడంతో ఏసీబీ కోర్టు తీర్పు విషయంలో జాప్యం జరుగుతోంది. క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది

Whats_app_banner