Chandrababu tour: మూడు నెలల తర్వాత తొలిసారి జనంలోకి చంద్రబాబు-chandrababu naidu is coming back to the public after a break of three months ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Tour: మూడు నెలల తర్వాత తొలిసారి జనంలోకి చంద్రబాబు

Chandrababu tour: మూడు నెలల తర్వాత తొలిసారి జనంలోకి చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Dec 08, 2023 07:22 AM IST

Chandrababu tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. సరిగ్గా మూడు నెలల విరామం తర్వాత మిగ్‌ జాం తుఫాను బాధితుల్ని పరామర్శించేందుకు బాబు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌ 9న స్కిల్‌ కేసులో అరెస్ట్‌ కావడంతో బాబు పర్యటనలు నిలిచిపోయాయి.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా మూడు నెలల తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు. మిగ్‌జాం తుఫానుతో నష్టపోయిన బాధితుల్ని పరామర‌్శించేందుకు చంద్రబాబు రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్ 9న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టైన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజల్లో పర్యటించడం ఆగిపోయింది. ఆ కేసులో అరెస్ట‌ైన తర్వాత దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది.

చంద్రబాబుపై ఉన్న ఆంక్షలు నవంబర్‌ 28తో తొలిపోయాయి. కేసుల విచారణ కొనసాగనుంది. మరోవైపు చంద్రబాబు ఇప్పటికే తిరుపతి, విజయవాడ ఆలయాల్లో మొక్కులు సమర్పించుకున్నారు. దాదాపు మూడు నెలలుగా టీడీపీ కార్యక్రమాలు స్తబ్దత కొనసాగుతోంది. చంద్రబాబు లేని లోటు మూడు నెలల్లో ఆ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపించింది.

కేసులు, కోర్టు విచారణల్లో చంద్రబాబుకు ఊరట లభించడంతో చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మిగ్‌జాం తుఫానుతో కోస్తాలో అపార నష్టం వాటిల్లడంతో రైతుల్ని పరామర్శించేందుకు రెడీ అయ్యారు. చంద్రబాబు పొలిటికల్ యాక్టివిటీని పెంచేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రత్యర్థి పార్టీ ప్రచారంలో ముందుకెళ్లి పోవడంతో చంద్రబాబు విస్తృతంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మిగ్ జాం తుఫానుతో నష్టపోయిన రైతులు, ప్రజలను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు శుక్ర, శనివారాల్లో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు, శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా తెనాలి మండ లంలోని నంది వెలుగు సందర్శిస్తారు. అక్కడ నుంచి అమృతలూరు వెళ్లి అక్కడ వాటిల్లిన నష్టాన్ని పరిశీలిస్తారు. అక్కడ రైతులతో సమావేశం అవుతారు.

ఆ తర్వాత నగరం మండలంలోని ఉత్తర పాలెం, కర్లపాలెం మండలంలోని పాత ఆనందాయ పాలెం గ్రామాలు కూడా సందర్శిస్తారు. తర్వాత బాపట్ల చేరుకొని ఆ రాత్రి అక్కడ బస చేస్తారు. శనివారం పాత ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఆయన సందర్శిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు పర్యటన కోసం టీడీపీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Whats_app_banner