Chandrababu to HYD: జైలు నుంచి ఉండవల్లికి చంద్రబాబు.. నిజం గెలవాలి వాయిదా
Chandrababu to HYD: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి నుంచి ఉండవల్లి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.
Chandrababu to HYD: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం సాయంత్రంలోగా హైకోర్టు ఉత్తర్వుల్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు జైలు అధికారులకు అందచేయనున్నారు. జైలు ఫార్మాలిటీస్ పూర్తైతే సాయంత్రంలోగా చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టీడీపీ వర్గాలు ప్రకటించాయి.
హైదరాబాద్‌లో చంద్రబాబుకు వైద్యపరీక్షలు, శస్త్ర చికిత్స నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు జైలు నుంచి హైదరాబాద్ వెళ్తారని ప్రచారం జరిగిన ఉండవల్లి నివాసానికి రానున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు నేడు చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు నారా లోకేష్, నారా బ్రాహ్మణి రాజమహేంద్రవరం చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల్లోగా బాబు జైలు నుంచి విడుదల అవుతారని భావిస్తున్నారు.
మరోవైపు సోమవారం లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చంద్రబాబును చేర్చడంతో బాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతించింది. మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
అటు రాజమండ్రి చేరుకున్న లోకేష్ వద్ద బెయిల్ విషయాన్ని విమానాశ్రయంలో టీడీపీ నాయకులు ప్రస్తావించారు. యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యిందని నాయకులు, కార్యకర్తల తో లోకేష్ పేర్కొన్నారు.
వాయిదా పడనున్న నిజం గెలవాలి…
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ఉత్తరాంధ్రలో జరగాల్సి ఉంది. మంగళవారం విజయనగరం రైలు ప్రమాదం బాధితుల్ని పరామర్శించిన తర్వాత చంద్రబాబు అరెస్ట్‌తో కలత చెందిన చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించాల్సి ఉంది. విజయనగరం పర్యటనకు భువనేశ్వరి బయల్దేరి వెళ్లిన తర్వాత బెయిల్ రావడంతో విజయనగరం జిల్లా పర్యటనకు మాత్రమే భువనేశ్వరి పరిమితం కానున్నారు.
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించిన తర్వాత భువనేశ్వరి తిరిగి రాజమండ్రి తిరిగివస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్రలో నిర్వహించాల్సిన నిజం గెలవాలి కార్యక్రమం వాయిదా పడినట్లు తెలిపారు. కార్యక్రమం షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామన్నారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు వస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
రాజమండ్రి నుంచి ఉండవల్లికి…
రాజమండ్రి, లాలాచెరువు, మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి, జొన్నాడ సెంటర్, రావులపాలెం, సిద్ధాంతం, పెరవలి, తాడేపల్లి గూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్, కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. రాత్రి 9.20లోగా చంద్రబాబు ఉండవల్లి చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.