Bjp Purandeswari: అలిపిరి మండపాల కూల్చివేతపై పురంధేశ్వరి అభ్యంతరం-bjp president purandeshwari objected to the demolition of centuries old alipiri mandapas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Purandeswari: అలిపిరి మండపాల కూల్చివేతపై పురంధేశ్వరి అభ్యంతరం

Bjp Purandeswari: అలిపిరి మండపాల కూల్చివేతపై పురంధేశ్వరి అభ్యంతరం

Sarath chandra.B HT Telugu

Bjp Purandeswari: అలిపిరి మండపాల కూల్చివేతలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అభ్యంతరం తెలిపారు. శతాబ్దాల చరిత్ర ఉన్న మండపాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయని వాటిని సంరక్షించాలన్నారు.

పురంధేశ్వరి

Bjp Purandeswari: ఏపీలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి శ్రీకారం చుట్టారు. బుధవారం అలిపిరిని సందర్శించిన అనంతరం పురందేశ్వరి తిరుమలలోని పార్వేట మండపం తొలగించి, యదావిధిగా నిర్మిస్తామని ఇష్టానుసారంగా చేశారని ఆరోపించారు.

ఇప్పుడు తిరుపతిలోని అలిపిరి వద్ద మండపాన్ని తొలగిస్తామని అంటున్నారని మండిపడ్డారు. 75 సంవత్సరాలు పూర్తి అయిన మండపాలను తొలగించాలంటే పురవస్తుశాఖ అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు. తిరుమలలో అలా జరగలేదన్నారు.

అలిపిరి వద్ద ఉన్న మండపం 500 సంవత్సరాలకంటే ఎక్కువే అయ్యిందని తెలిపారు. అలిపిరిలోని మండపాన్ని ఏమి చేయాలన్నాటీటీడీ తప్పకుండా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోనే చేయాలని, లేదంటే బీజీపే తప్పకుండా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. మండపాల మరమ్మతులు, తొలగింపు వంటి పనులు ఖచ్చితంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ‌్వర్యంలోనే జరగాలని డిమాండ్ చేశారు.

టీటీడీ నిధులను తిరుపతి మున్సిపాలిటీకి కేటాయించే విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గిందని, మరో మార్గంలో టీటీడీ నిధులను పొందేందుకు ప్రయత్నాలు జరుగుతోందని, అదే జరిగితే బీజేపీ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు.

చెత్త పన్ను, కరెంటు చార్జీల మోత ఇలా ఎన్నో రకాలుగా వసూలు చేస్తున్న పన్నులతోనే మౌలీక సౌకర్యాలు కల్పించాలన్నారు. టీటీడీ నిధులతో సనాతన ధర్మా అభ్యున్నతికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇమామ్‌లకు, ఫాస్టర్లకు గౌరవవేతనం ఇస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ అర్చకులు ఉన్న ఆలయాల ధూప దీప నైవేద్యాలకు ఇస్తున్న సంభావనలను మాత్రం నిలిపివేసిందని ఆరోపించారు. దళిత అర్చకులకు నిలిపివేసిన సంభావనను వెంటనే కొనసాగించాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.