Maddelacheruvu Suri Murder Case : మద్దెలచెర్వు సూరి హత్య కేసు - 12 ఏళ్ల తర్వాత జైలు నుంచి భాను కిరణ్‌ విడుదల-bhanu kiran released from jail on bail in maddelacheruvu suri murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Maddelacheruvu Suri Murder Case : మద్దెలచెర్వు సూరి హత్య కేసు - 12 ఏళ్ల తర్వాత జైలు నుంచి భాను కిరణ్‌ విడుదల

Maddelacheruvu Suri Murder Case : మద్దెలచెర్వు సూరి హత్య కేసు - 12 ఏళ్ల తర్వాత జైలు నుంచి భాను కిరణ్‌ విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 06, 2024 04:52 PM IST

Maddelacheruvu Suri Murder Case Updates : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన భాను కిరణ్ విడుదలయ్యాడు. 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న భాను కిరణ్ కి బెయిల్ రావటంతో… బుధవారం జైలు నుంచి బయటికి వచ్చారు.

చంచల్‌గూడ జైలు నుంచి భానుకిరణ్‌ విడుదల
చంచల్‌గూడ జైలు నుంచి భానుకిరణ్‌ విడుదల

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మద్దెల చెరువు సూరి హత్య కేసు సంచ‌ల‌నం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్‌ బుధవారం చంచల్ గూడ  జైలు నుంచి విడుదలయ్యారు.  హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

2011లో మద్దెల చెరువు సూరి హత్య జరిగింది. కారులో ప్రయాణిస్తుండగా హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నవోదయ కాలనీలో సూరిని భాను కిరణ్ రివాల్వర్ తో కాల్చిచంపాడు. ఈ  కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2018 డిసెంబర్‌లో భాను కిరణ్ కు నాంపల్లి కోర్టు జీవిత ఖైదుగా శిక్ష ఖరారు చేసింది. అప్పట్నుంచి భానుకిరణ్ జైల్లోనే ఉంటున్నాడు. బెయిల్ కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాడు. 

ఉమ్మడి ఏపీలో సంచలనం… !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కేసులో మద్దలచెర్వు సూరి హత్య కేసు ఒకటి.  ఈ కేసులో నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టు యావజ్జీవ శిక్షను కూడా  ఖరారు చేసింది. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య తర్వాత… సూరి కూడా అనుచరుడైన భాను కిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. 

యూసఫ్‌గూడ మీదుగా వెళుతున్న కారులో వెనుక సీటులో కూర్చున్న నిందితుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో సూరిని తలపై కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూరి నిందితుడిగా ఉన్నారు. సూరి జైల్లో ఉన్న సమయంలో వసూలు చేసిన డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన వివాదంతో అనుచరుడే హత్య చేసినట్టు ప్రచారం జరిగింది. సూరిని పథకం ప్రకారమే హత్య చేయించారని సూరి భార్య గంగుల భానుమతి అప్పట్లో చాలాసార్లు ఆరోపించారు.

సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ‌్‌ యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018 డిసెంబరులో కింది కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు సవాలు చేస్తూ భాను హైకోర్టులో అప్పీలు చేశాడు. నిందితుడి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం,,, సూరిని హత్య చేసిన భాను తరఫు న్యాయవాది పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. అయితే  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ… పిటిషనర్ వాదనలను తోసిపుచ్చారు. భానుకిరణ్‌ పథకం ప్రకారం సూరిని హత్య చేశారని స్పష్టం చేశారు.

హత్య జరిగిన రోజున సూరితో పాటు భాను కూడా అదే కారులో ప్రయాణించాడని వివరించారు. వెనుక సీట్లో కూర్చుని పథకం ప్రకారమే తలపై కాల్చి చంపారని వివరించారు. హత్య చేసిన తరువాత మధ్యప్రదేశ్‌ పారిపోయారని, నిందితుడిని గాలించి పట్టుకున్నారని కోర్టుకు తెలిపారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం భాను అప్పీలును కొట్టివేసింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఖరారు చేసింది. ఈ కేసులో 12 ఏళ్లుగా భాను కిరణ్ జైల్లోనే ఉంటున్నాడు. 

 

 

Whats_app_banner