AP Votes Deleted Issue : పర్చూరు ఓట్ల తొలగింపులో జోక్యం, నలుగురు పోలీసులపై వేటు!-bapatla parchur mla sambasiva rao complaint on voter deletion ec suspended four police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Votes Deleted Issue : పర్చూరు ఓట్ల తొలగింపులో జోక్యం, నలుగురు పోలీసులపై వేటు!

AP Votes Deleted Issue : పర్చూరు ఓట్ల తొలగింపులో జోక్యం, నలుగురు పోలీసులపై వేటు!

Bandaru Satyaprasad HT Telugu
Oct 25, 2023 10:21 PM IST

AP Votes Deleted Issue : పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపులో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలడంతో నలుగు పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. నలుగురు పోలీసులను సస్పెండ్ చేసింది.

ఓట్ల తొలగింపు
ఓట్ల తొలగింపు

AP Votes Deleted Issue : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఓట్ల తొలగింపులో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై చర్యలు తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం, బాపట్ల ఎస్పీని నివేదిక కోరింది. ఎస్పీ నివేదికతో ఓట్ల తొలగింపులో జోక్యం చేసుకున్న మార్టూరు సీఐ, ఎస్సై, పర్చూరు, యద్దనపూడి ఎస్సైలను సస్పెండ్ చేస్తూ సీఈవో ముకేశ్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఓట్ల తొలగింపుతో సంబంధం ఉన్న బీఎల్వోలు, మహిళా పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఈవో చర్యలు తీసుకున్నారు.

yearly horoscope entry point

హైకోర్టు సీరియస్

పర్చూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న పోలీసులపై వేటుపడింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని అధికార పార్టీకి చెందిన నేతలకు అందించారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించి విచారణ చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు. ఈ విచారణలో బీఎల్‌వోలు పోలీసులకు సమాచారం పంపిన విషయం వెలుగుచూసింది. పోలీసుల జోక్యం ఉందని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోలేదని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్టూరు సీఐ, పర్చూరు, యుద్ధనపూడి, మార్టూరుల ఎస్సైలను సస్పెండ్ చేస్తూ మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు ఇచ్చారు.

పోలీసులు అధికారులపై ఒత్తిడి

పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సాంబశివరావు గతంలో ఆరోపించారు. ఓట్ల తొలగింపులో ఉన్నతాధికారుల నుంచి బీఎల్వోల వరకు బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల ఫారం-7 అప్లై చేయంగా, ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే 25 వేల మంది ఓట్లు తొలగించడానికి ప్లాన్ వేశారని ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా, స్పందించడంలేదన్నారు. పర్చూరు, మార్టూరు, యద్దనపూడి మండలాల ఎస్సైలతో పాటు మార్టూరు సీఐ కూడా ఫారం-7 దరఖాస్తులు పెట్టడంలో అధికారులపై ఒత్తిడి తెచ్చారని, పూర్తి సాక్ష్యాధారాలతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఎన్నికల సంఘం నలుగురి పోలీసులపై వేటు వేసింది.

Whats_app_banner