Atal Pension Yojana: దేశంలోని దాదాపు 50 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల్లో సగటున 90శాతం మందికి వృద్దాప్యంలో ఎలాంటి పెన్షన్ సదుపాయం లేకపోవడంతో వారి జీవనం కష్టంగా మారుతోంది. అసంఘటిత రంగంలో ఉన్న వారికి అవసాన దశలో ఆసరా కోసం 2015లో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
18 ఏళ్ల వయసు నుండి 40 ఏళ్ల వయసున్న వారు తమ బ్యాంకు సేవింగ్ ఖాతా ద్వారా ఈ పించన్ పథకంలో చేరవచ్చు. ఖాతా లేని వారు కొత్తగా ఖాతా తెరిచి ఈ పథకంలో చేరవచ్చు. గ్రామీణ బ్యాంకులతో పాటు నేషనల్ పెన్షన్ పథకంలో భాగంగా ఏ జాతీయ బ్యాంకులోనైనా ఏపీవై ఖాతాను తెరవొచ్చు.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ద్వారా సామాజిక భద్రత సౌకర్యం కలవారు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారు. బ్యాంకు ఖాతాలో మొబైల్ నంబర్ నమోదు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్‌పిఎస్ ఖాతాలో జీవిత భాగస్వామి వివరాలు, నామిని పేరు కూడా రాయాల్సి ఉంటుంది. ఒకరికి ఒక పింఛన్ ఖాతా మాత్రమే కలిగి ఉండాలి.
చందా దారుడి వయసు, ప్రతి నెల జమ చేసే మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయసు నుండి ప్రతి నెలా ప్రభుత్వం వేయి రుపాయలు మొదలుకుని ఐదువేల రూపాయల వరకు కనీస పించన్ చెల్లిస్తుంది. చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పించన్ ఇస్తారు. ఇద్దరి తర్వాత వారసులకు పించన్ నిధిని చెల్లిస్తారు. ఏడాదిలో చందాదారుడు దాచుకున్న మొత్తంలో సగం వరకు (గరిష్టంగా వేయి రూపాయలు) పించన్ ఖాతాలో ప్రభుత్వం అదనంగా జమ చేస్తుంది. ఇలా ఐదేళ్ళ పాటు ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. 2015 జూన్ 1 నుండి 2016 మార్చి 31 లోపు ఈ పథకంలో చేరిన వారికి మాత్రమే ప్రభుత్వం ఇలా వేయి రూపాయలు జమ చేస్తుంది.
బ్యాంకు ఖాతా నుండి ఆటో డెబిట్ విధానంలో ప్రతినెలా వాయిదా మొత్తాన్ని బదిలీ చేసేందుకు చందాదారుడి బ్యాంకు ఖాతాలో తగిన నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. చందాదారుడి ఖాతా నుండి పెన్షన్ నిధికి సొమ్ము మళ్ళిన ప్రతి సారి మొబైల్ ఫోన్ కి సంక్షిప్త సందేశం వస్తుంది. ఖాతా స్టేట్మెంట్‌ను కూడా బ్యాంకు నుంచి పొందవచ్చు.
ఏ నెలలోనయినా తగినంత నిల్వ లేకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకును బట్టి ఈ మొత్తం పెనాల్టీ ఉంటుంది. ఇలా వసూలు చేసే అపరాధ రుసుమును నిర్వహణ ఖర్చులకు కేటాయించకుండా మీ పెన్షన్ ఫండ్‌లోనే జమ చేస్తారు. 6 నెలల వరకు ప్రీమియం జమ కాకపోతే ఖాతాను స్తంభింపచేస్తారు. 12 నెలల వరకు జమ లేకపోతే ఖాతా డార్మెంట్ స్థితిలోకి వెళ్తుంది.
ఏపీవై కూడా ఇన్సూరెన్స్ పాలసీ వంటిదే.దీనికి ప్రీమియం చెల్లించమని ఎవరు గుర్తు చేయరు. ఒకసారి పథకంలో చేరిన తర్వాత విధిగా ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత చందాదారుడిపై ఉంటుంది. ఏపీవైలో ప్రీమియం చెల్లించమని గుర్తు చేసే వ్యవస్థ ఏది ప్రత్యేకంగా లేదు. ఆటో డెబిట్ సిస్టమ్ కావడంతో ఎప్పుడు నగదు పెన్షన్ నిధికి వెళుతుందో తెలీదు. సమయానికి ఖాతాలో నగదును నిల్వ ఉంచడమే దీనికి పరిష్కారం. ఇక 60ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే చందాదారుడు ఏపీవై డబ్బులు అందుకోడానికి వీలవుతుంది.