Praveen Prakash VRS: ప్రవీణ్‌ ప్రకాష్‌ స్వచ్చంద పదవీ విరమణకు ప్రభుత్వ అమోదం, దరఖాస్తు చేసిన రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు-approval for voluntary retirement of ias officer praveen prakash ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Praveen Prakash Vrs: ప్రవీణ్‌ ప్రకాష్‌ స్వచ్చంద పదవీ విరమణకు ప్రభుత్వ అమోదం, దరఖాస్తు చేసిన రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు

Praveen Prakash VRS: ప్రవీణ్‌ ప్రకాష్‌ స్వచ్చంద పదవీ విరమణకు ప్రభుత్వ అమోదం, దరఖాస్తు చేసిన రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు

Sarath chandra.B HT Telugu
Jul 10, 2024 10:09 AM IST

Praveen Prakash VRS: ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌‌ ప్రకాష్‌ స్వచ్చంధ పదవీ విరమణ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం అమోదించింది. ఆయన సర్వీసు నుంచి వైదొలిగేందుకు అనుమతించింది.

ప్రవీణ్ ప్రకాష్ విఆర్‌ఎస్‌కు ప్రభుత్వ అమోదం
ప్రవీణ్ ప్రకాష్ విఆర్‌ఎస్‌కు ప్రభుత్వ అమోదం

ఆంధ్రప్రదేశ్‌ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ చేసుకున్న వాలంటరీ రిటైర్మెెంట్ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1994 బ్యాచ్‌కు చెెందిన ప్రవీణ్ ప్రకాష్ మరో ఏడేళ్ల సర్వీస్‌ ఉండగానే పదవీ విరమణ చేయనున్నారు.

yearly horoscope entry point

2031 జూన్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్నా ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్రవీణ్ ప్రకాష్ విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తును పక్షం రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమోదించింది. ఈ ఏడాది జూన్ 25వ తేదీన వీఆర్ఎస్ కోసం ప్రవీణ్ ప్రకాష్ దరఖాస్తు కోగా దానిని అమోదిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఏడాదిన్నర కిందటే వీఆర్ఎస్ తీసుకోవాలని భావించిన ప్రవీణ్ ప్రకాష్‌, సన్నిహితుల సూచన మేరకు అప్పట్లో వీఆర్ఎస్ పై వెనక్కు తగ్గారు. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పెత్తనం చెలాయిస్తున్నారని ఐఏఎస్‌ అధికారుల నుంచి విమర్శలు రావడంతో ఆయనను విద్యాశాఖకు బదిలీ చేశారు. ఆ సమయంలో పదవీ విరమణ చేసి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావించారు.

అదే సమయంలో ఐదారు సార్లు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఆయన దరఖాస్తు చేసిన ప్రతిసారి కేంద్రం దానిని తిరస్కరించింది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌‌కు విరుద్ధంగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన చర్యలతో ఇబ్బందులకు గురైన అధికారులు డిఓపిటి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో ప్రవీణ్ ప్రకాష్‌ను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోడానికి నిరాకరించినట్టు ప్రచారం జరిగింది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ తనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని భావించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే ఆయన విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసకున్నారు. ప్రవీణ్ ప్రకాష్‌ వీఆర్ఎస్ సెప్టెం బరు 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రవీణ్‌ ప్రకాష్‌ను విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పించారు. జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించింది. మరోవైపు వీఆర్ఎస్‌ దరఖాస్తు చేయడంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ గందరగోళం సృష్టించారు. వీఆర్ఎస్ కోసం చేసిన దరఖాస్తులో చేతిరాతతో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు. అది చెల్లదని దరఖాస్తును తిప్పి పంపడంతో మరోసారి దరఖాస్తు సమర్పించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విఆర్‌ఎస్ అస్త్రం ప్రయోగించారని సచివాలయంలో ప్రచారం జరిగింది.

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాను పని చేయలేనంటూ ఎన్నికల ముందు నుంచి ప్రవీణ్ ప్రకాష్‌ చెబుతూ వచ్చారు. తనకు మంచి ప్రైవేట్ ఉద్యోగం చూడాలని అప్పట్లో ఓ ఐఏఎస్‌కు వాట్సప్‌ సందేశం కూడా పంపారని సమాచారం.

విద్యాశాఖలో ఉండగా గత ఏడాది బడిఈడు పిల్లలు బడి బయట కని పిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ హడావుడి చేశారు. విద్యాశాఖలో వింత నిర్ణయాలతో ఇబ్బంది పెట్టినట్టు ఉపాధ్యాయులు వాపోయేవారు. సమీక్షలు, శిక్షల పేరుతో ఒత్తిడి పెంచేవారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగానికి రాజీ నామా చేస్తారని కూడా ప్రచారం సాగింది.

కాగా ఢిల్లీలో తాను పనులు చక్కబెడతానని చెప్పుకుని ఏపీ సీఎంఓలో అంతులేని అధికారాన్ని అనుభవించారని ప్రవీణ్ ప్రకాష్ విమర్శలు ఎదుర్కొన్నారు.

విజయవాడ రూపు రేఖలు మార్చిన ఘనత అతనిదే…

వైసీపీ ప్రభుత్వంలో వివాదాస్పద నిర్ణయాలతో అందరికి దూరమైన ప్రవీణ్ ప్రకాష్ విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఎవరిని ఖాతరు చేయకుండా రోడ్ల విస్తరణ చేపట్టారు. 20ఏళ్ల క్రితం నగరంలోని ప్రధాన రోడ్ల విస్తరణ ప్రవీణ్ ప్రకాష్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే చేపట్టారు. నగర అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టారు.

2002-2003 మధ్య కాలంలో విజయవాడలోని ఎంజి రోడ్డు, కార్ల్ మార్క్స్‌ రోడ్ల విస్తరణ చేపట్టారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా వెనుకంజ వేయలేదు. నగరంలో పెరిగిన రద్దీని అప్పుడు విస్తరించిన రోడ్లు  కొంత మేరకు  ఆదుకుంటున్నాయి. పాతబస్తీ వంటి ఇరుకు ప్రాంతాల్లో కూడా రోడ్లను విస్తరించి ఘనత ప్రవీణ్ ప్రకాష్‌కే దక్కింది. బ్రాహ్మణ వీది, పండిట్ జవహర్‌ లాల్‌ నెహ్రూ రోడ్డు, కేటీ రోడ్డు, బిఆర్పీ రోడ్లను కూడా ప్రవీణ్ ప్రకాష్ విస్తరించారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు ఎవరు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయారు. 

Whats_app_banner