ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి అదే కారణమా?
Praveen Prakash IAS | ముఖ్యమంత్రి జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇది హాట్‌టాపిక్‌గా మారింది. జగన్‌కు ఇష్టమైన వ్యక్తిగా గుర్తింపుపొందిన ప్రవీణ్‌ను ఇంత అనూహ్యంగా బదిలీ చేయడం వెనకే అనేక కారణాలు ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.
Praveen Prakash IAS latest news | ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిది. ఇన్నేళ్లు ఆ పదవిలో ఉన్న ఆయనను ఒక్కసారిగా బదిలీ చేయడంపై విపరీతంగా ఊహాగానాలు జోరందుకున్నాయి.
సీఎం ముఖ్య కార్యదర్శి నుంచి ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేసి.. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. ఇక ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న భావన సక్సేనాకు విదేశీ మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ పదవి ఇచ్చారు.
సీఎం జగన్.. 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రవీణ్ ప్రకాష్.. ప్రభుత్వంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి.. ఇంతకాలం సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో.. జగన్ ముందు మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్ అధికారి.. ప్రవీణ్ కుమార్. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అయితే.. జగన్‌కు ఇష్టమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న ప్రవీణ్ వ్యవహారంపై అధికారులు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించుకునే వారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన వల్ల ఇతర అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య.. ఆయన్ని జీఏడీ వ్యవహారాల నుంచి తప్పించి.. ముఖ్య కార్యదర్శి పదివికి పరిమితం చేసింది ప్రభుత్వం. కానీ ఆ పదవి నుంచి కూడా తప్పిస్తుందని ఎవరూ ఊహించలేదు.
మరో బదిలీ..
ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేస్తున్నట్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన కొద్ది గంటలకే.. మరో అధికారిపై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని మంగళవారం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. గౌతమ్ సవాంగ్ స్థానంలో ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలతో డీజీపీగా నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ ఆందోళనలో భాగంగా ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనను విఫలం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ.. ఉద్యోగుల ఆందోళనకు పోలీసు విభాగం పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణలు వినిపించాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డీజీపీపై వేటు వేసినట్టు తెలుస్తోంది
నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా, విజిలెన్స్ డీజీగా పనిచేశారు. ఆయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
సంబంధిత కథనం