AP TG Weather Report : తుపాను, ఆవర్తనం ఎఫెక్ట్- రేపు ఏపీ, తెలంగాణలో వర్షాలు
AP TG Weather Report : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా మారి రేపు అర్ధరాత్రికి తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. ఆవర్తనం, తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.
AP TG Weather Report : తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో దాదాపు ఉత్తరం వైపుగా కుదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం నాటికి తూర్పు మధ్య ప్రాంతాన్ని ఆనుకొని ఉత్తర బంగాళాఖాతం మీదుగా తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం(మే 26) అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ఐలాండ్-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8 కిమీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, మరో ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించిందని తెలిపారు. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో ఏపీలో ఆదివారం వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
25 ప్రాంతాల్లో పిడుగులు
శనివారం సాయంత్రం 6 గంటల నాటికి అనంతపురం రాయదుర్గంలో 38.5 మిమీ, విజయవాడ తూర్పులో 34.5 మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 30.5 మిమీ, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 30.5 మిమీ, విజయవాడ సెంట్రల్ లో 30.2 మిమీ, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 29.2 మిమీ, ఏలూరు జిల్లా నూజివీడులో 27.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 25 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.
మరింత ముందుకు నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించి ముందుకు సాగాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
తెలంగాణలో ఎండలు
తెలంగాణలో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ 44 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రానున్న 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది.