AP TET 2024 Updates : ఈనెల 22న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - 'మాక్ టెస్ట్' ఆప్షన్ ఎప్పట్నుంచంటే..!-ap tet hall tickets 2024 will be released on september 22 latest updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Updates : ఈనెల 22న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - 'మాక్ టెస్ట్' ఆప్షన్ ఎప్పట్నుంచంటే..!

AP TET 2024 Updates : ఈనెల 22న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - 'మాక్ టెస్ట్' ఆప్షన్ ఎప్పట్నుంచంటే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 11, 2024 09:28 AM IST

AP TET Hall Tickets 2024: ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. ఈనెల 22 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు... 20వ తేదీతో ముగియనున్నాయి. టెట్ అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ నుంచి హాల్ టికెట్లను పొందవచ్చు.

ఏపీ టెట్ హాల్ టికెట్లు 2024
ఏపీ టెట్ హాల్ టికెట్లు 2024

AP TET Hall Tickets 2024: ఏపీ టెట్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ దృష్టిపెట్టింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా... త్వరలోనే(సెప్టెంబర్ 19,2024) మాక్ టెస్టులను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఈనెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్:

  • ఏపీ టెట్ అభ్యర్థులు మొదటగా https://aptet.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీతో పాటు Verfication Code ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

వచ్చే నెలలో పరీక్షలు:

ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజుల పాటు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

మరోవైపు పరీక్ష ముగిసిన తర్వాత రోజు అంటే అక్టోబర్‌ 4 నుంచి వరుసగా ప్రైమరీ 'కీ' లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 5 నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక అక్టోబర్‌ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్‌ 2న ఏపీ టెట్ - 2024 తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్ లైన్ మాక్ టెస్టులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి వెబ్ సైట్ లో అందుబాటులోకి వస్తాయి.

టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ మేరకు జులై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.

ఏపీ టెట్ - 2024 కోసం మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌-1బి కు 2,662 మంది అప్లై చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులు పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఏపీ టెట్ సిలబస్, పరీక్షా విధానం:

టెట్‌ పేపర్‌–1ఎ, 1బి, పేపర్‌–2ఎ, 2బిలను 150 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఏపీ టెట్‌లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి.

ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

పేపర్‌–2ఎ చూస్తే… ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి నుంచి 30 మార్కులు వస్తాయి. ఇక లాంగ్వేజ్ 1 నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకు గానూ పరీక్ష నిర్వహిస్తారు.నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్‌ విషయంలో..మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్‌ విభాగాన్ని, సోషల్‌ టీచర్లు సోషల్‌ స్టడీస్‌ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది.

పేపర్‌–2బిలో చూస్తే చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్‌1 నుంచి 30, గ్వేజ్‌ 2(ఇంగ్లిష్‌)-30, డిజేబిలిటీ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌ అండ్‌ పెడగాజి నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకుగానూ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌–2బిలో నాలుగో విభాగంలో అభ్యర్థులు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Whats_app_banner