APSDMA Alerts: ఉత్తరాంధ్రకు నేడు కూడా వర్ష సూచన… రైతులు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ-ap sdma rain alert for north coastal districts of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsdma Alerts: ఉత్తరాంధ్రకు నేడు కూడా వర్ష సూచన… రైతులు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ

APSDMA Alerts: ఉత్తరాంధ్రకు నేడు కూడా వర్ష సూచన… రైతులు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ

Sarath chandra.B HT Telugu
Mar 21, 2024 12:49 PM IST

APSDMA Alerts: బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

ఉత్తరాంధ్రలో వర్షాలు
ఉత్తరాంధ్రలో వర్షాలు (https://unsplash.com/)

APSDMA Alerts: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురువారం కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. పంట కోతల సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గురువారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలో శుక్రవారం నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుతాయని తెలిపారు. అల్లూరి జిల్లాలో బుధ, గురువారాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

బుధవారం విజయనగరం జిల్లా గరివిడిలో 13 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. పంట కోతల సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అనకాపల్లిలో ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. అనంత పురం, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండి విశాఖ పట్నం కేంద్రం ప్రకటించింది.

తెలంగాణలో వర్షాలు…

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంఅటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి పడటంతో మృతిచెందింది.

తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న కవల చిన్నారులు రేకుల షెడ్డుకు ఊయల కట్టుకుని ఆడుకుంటున్నారు. గాలి దుమారం విరుచుకు పడటంతో రేకుల షెడ్డుతో చిన్నారి ఎగిరి దూరంగా పడిపోయింది. ఈ ఘటనలో ఐదేళ్ల బాలిక సంగీత మృతి చెందింది.

మెదక్‌ జిల్లాలో జరిగిన విషాద ఘటనలో కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలో బాలిక మృతి చెందింది. మంజుల, మాన్సింగ్‌ దంపతులకు సంగీత, సీత అనే కవలలు ఉన్నారు. తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సంగీత (5) ఒకటో తరగతి చదువుతోంది.

సోమవారం తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో రేకుల షెడ్డుకు కట్టిన చీర ఉయ్యాలలో సంగీత ఆడుకుంటోంది. బాలిక నానమ్మ, సోదరి పక్కింటికి వెళ్లడంతో చిన్నారి ఒక్కతే ఆడుకుంటూ ఉంది.

సుడిగాలి ధాటికి ఉయ్యాలలో ఉన్న బాలిక ఇంటి రేకులతో పాటు ఎగిరిపోయింది. ఇంటికి దూరాన ఉన్న భవనం స్లాబ్‌పై పడిపోయింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. బాలికను గమనించిన స్థానికులు 108లో నర్సాపూర్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు

Whats_app_banner