AP Inter Exams Fee : ఏపీ ఇంటర్ విద్యార్థులకు కీలక అప్‌డేట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 21 వరకు పొడిగింపు
AP Inter Exams Fee : ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగించింది. నవంబర్ 21 వరకు ఎటువంటి ఫైన్ లేకుండానే పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి మార్చిలో జరగబోయే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాసే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు నవంబర్ 21 వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రూ.1,000 ఫైన్‌తో డిసెంబర్ 5 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
తొలుత అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ. 1,000 ఫైన్‌తో నవంబర్ 20 వరకు అవకాశం కల్పించారు. అయితే తాజా గడువు నవంబర్ 21 వరకు పెంచారు. రూ.1,000 ఫైన్‌తో డిసెంబర్ 5 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మరోసారి గడువు పొడిగింపుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చదివే విద్యార్థులకు జనరల్ థియరీ సబ్జెక్టులకు రూ.600, రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు రూ.275, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ.165 చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపారు.
మొదటి, రెండో ఏడాదికి కలిపి థియరీ పరీక్షలకు రూ.1,200 చెల్లించాలని, హాజరు మినహాయింపు కోరేవారు, ప్రైవేటు అభ్యర్థులుగా పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది. వీరు రూ.1,500 ఫీజు నవంబర్ 15 లోపు చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 ఫైన్‌తో నవంబర్ 30 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌ని అడిగి తెలుసుకోవచ్చు.
పదో తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఎస్ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఈనెల 18 వరకు ఫీజులు చెల్లింపునకు అవకాశం కల్పించారు. అలాగే రూ.50 ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 3 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఫీజును https://bse.ap.gov.in/ లో స్కూల్ లాగిన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో నామినల్ రోల్స్ సమర్పించేందుకు, ఫీజు చెల్లింపునకు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు.
ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఆపార్) ఐడీతో పోల్చి విద్యార్థి నామినల్ రోల్స్‌లో మార్పులు చేసేందుకు హాల్ టికెట్ జారీకి ముందు ఎడిట్ అవకాశం కల్పిస్తామని ఎస్ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి పేర్కొన్నారు.
ఫీజుల వివరాలు
- అన్ని సబ్జెక్టులకు (మూడు సబ్జెక్టులకు మించి) రూ. 125 ఫీజు
- మూడు సబ్జెక్టుల వరకు రూ.110 ఫీజు
- ఒకేషనల్ విద్యార్థులు అదనంగా మరో రూ.60 ఫీజు
- నిర్ణీత వయససు కంటే తక్కువ ఉన్నవారు రూ.300 ఫీజు
- మైగ్రేషన్ సర్టిఫికేట్‌కు రూ.80 ఫీజు
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం