Skill Scam Case : అప్పటి వరకు అరెస్ట్‌ చేయవద్దు - స్కిల్ స్కామ్ కేసులో లోకేశ్‍కు స్వల్ప ఊరట, హైకోర్టు ఆదేశాలు-ap high court key orders in lokesh bail petition in skill scam case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Skill Scam Case : అప్పటి వరకు అరెస్ట్‌ చేయవద్దు - స్కిల్ స్కామ్ కేసులో లోకేశ్‍కు స్వల్ప ఊరట, హైకోర్టు ఆదేశాలు

Skill Scam Case : అప్పటి వరకు అరెస్ట్‌ చేయవద్దు - స్కిల్ స్కామ్ కేసులో లోకేశ్‍కు స్వల్ప ఊరట, హైకోర్టు ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 29, 2023 03:52 PM IST

Nara Lokesh Bail Petition: స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 4వ తేదీ వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది.

స్కిల్ స్కామ్ కేసులో హైకోర్టు ఆదేశాలు
స్కిల్ స్కామ్ కేసులో హైకోర్టు ఆదేశాలు

Skill Development Scam Updates: స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం… అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయవద్దని ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో లోకేశ్ కు స్వల్ప ఊరట దక్కినట్లు అయింది. స్కిల్ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్‌ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లోకేశ్ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

yearly horoscope entry point

రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Lokesh Bail Petitions: నారా లోకేష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంపై 2022 ఏప్రిల్‌లో నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేష్‌ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. దీంతో సిఐడి అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి సురేష్‌ రెడ్డి ప్రకటించారు.

మరోవైపు నారా లోకేష్‌కు నోటీసులివ్వడానికి సిఐడి ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్లాయి. దీంతో సిఐడి ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు సహకరించాల్సిందేనంటూ లోకేష్‌కు కోర్టు తేల్చి చెప్పడంతో తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో లోకేశ్‌ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్‌ బృందం గుర్తించింది. సిట్‌ సేకరించిన ఆధారాల్లో.. సీఆర్‌డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్‌ సందేశాలు, మ్యాపులు, టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలు ఉన్నాయి. కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్‌ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా నాయకుల ప్రమేయాన్ని నిర్ధారించాయి. నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ను నిర్ధారించారని సిట్‌ అధికారులకు ఈమెయిల్స్‌ పంపాయి. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్‌ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్‌ కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపిస్తోంది.

Whats_app_banner