AP High Court: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్ మంజూరు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
AP High Court: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో ఉన్నత న్యాయస్థానం పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది.
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో బెయిల్ వచ్చింది. ఈ రెండు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. పాస్‌పోర్ట్ అప్పగించాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జూన్ 26న పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు. 59 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్‌లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఈవీఎంల ధ్వంసం, అల్లర్లు, సీఐపై హత్యాయత్నం, మహిళకు బెదిరింపుల కేసులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై నమోదయ్యాయి. ఈ కేసులలో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ.. గతంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ.. పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువడిన కాసేపటికే.. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన సోదరుడిపై కూడా ఆరోపణలు ఉన్నాయి.
మే 13 జరిగిన ఎన్నికల్లో.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో చర్చనీయాశంగా మారింది. ఈ ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన పోలీసులకు దొరకలేదు. ఆ సమయంలోనే తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.