AP High Court: వైఎస్సార్సీపీ కార్యాలయాలకు ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట, రికార్డులు సమర్పించాలని ఆదేశం
AP High Court: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీకి పాక్షిక ఊరట లబించింది. ప్రభుత్వ స్థలాలను కారుచౌకగా లీజుకు తీసుకుని పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారనే అభియోగాలతో నోటీసులు జారీ చేయడంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
AP High Court: ప్రభుత్వ స్థలాల్లో లీజు పేరిట తీసుకున్న భూముల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం వ్యవహారంలో వైఎస్సార్సీపీకి పాక్షిక ఊరట లభించింది. వైసీపీ ఆఫీసుల నిర్మాణం విషయంలో చట్ట పరమైన నిబంధనలు అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
గత వారం తాడేపల్లిలోని ఇరిగేషన్ బోట్ హౌస్ స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ స్థలాల్లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలకు సంబంధించిన అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలకు సంబంధించి సమాధానాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాలను కూల్చి వేయకుండా స్టే విధించాలని కోరుతూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయ స్థానం 2 నెలల్లో ఆ భవనాలకు సంబంధించిన అనుమతులు, ఆధారాలు, ఫీజుల చెల్లింపులకు సంబంధించిన రికార్డులను అధికారుల ముందు ఉంచాలని వైసీపీని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
వైసీపీ ప్రతినిధులు ఇచ్చే సమాధానం ఆధారంగా వారికి తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా ఉంటే తప్ప కూల్చివేతల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఏపీ కోర్టు ఆదేశించిది. పార్టీ కార్యాలయాలపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణను ఏపీ హైకోర్టు ముగించింది. ప్రతి దశలోను వివరణ ఇచ్చేందుకు వైసీపీకి అవకాశం ఇవ్వాలని హైకోర్టు సూచించింది.