Lokesh Bail Petitions: లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు-ap high court dismissed lokeshs anticipatory bail plea ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh Bail Petitions: లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

Lokesh Bail Petitions: లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

HT Telugu Desk HT Telugu
Sep 29, 2023 01:13 PM IST

Lokesh Bail Petitions: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో ఏపీ సిఐడి అరెస్ట్‌ చేయకుండా నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. లోకేష్‌కు సిఆర్‌పిసి 41ఏ ప్రకారం నోటీసులిచ్చి విచారిస్తామని ప్రకటించడంతో లోకేష్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు

నారా లోకేష్
నారా లోకేష్

Lokesh Bail Petitions: నారా లోకేష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంపై 2022 ఏప్రిల్‌లో నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేష్‌ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. దీంతో సిఐడి అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి సురేష్‌ రెడ్డి ప్రకటించారు.

మరోవైపు నారా లోకేశ్‌ మరో రెండు కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో పిటిషన్లు వేసిన లోకేష‌‌ తరఫు న్యాయవాదులు అత్యవసరంగా వాటిని విచారించాలని కోరారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశముంది.పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.

మరోవైపు నారా లోకేష్‌కు నోటీసులివ్వడానికి సిఐడి ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్లాయి. దీంతో సిఐడి ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు సహకరించాల్సిందేనంటూ లోకేష్‌కు కోర్టు తేల్చి చెప్పడంతో తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో లోకేశ్‌ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్‌ బృందం గుర్తించింది.

సిట్‌ సేకరించిన ఆధారాల్లో.. సీఆర్‌డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్‌ సందేశాలు, మ్యాపులు, టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలు ఉన్నాయి.

కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్‌ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా నాయకుల ప్రమేయాన్ని నిర్ధారించాయి. నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ను నిర్ధారించారని సిట్‌ అధికారులకు ఈమెయిల్స్‌ పంపాయి. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్‌ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్‌ కీలక పాత్ర పోషించారని సిఐడి ఆరోపిస్తోంది.

Whats_app_banner