IPS Officers Suspended : ముంబయి నటి కేసు-ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు
IPS Officers Suspended : మంబయి నటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ వేటు వేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
IPS Officers Suspended : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబయి నటి వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేసింది. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు పడింది.
ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ముంబయి నటి ఫిర్యాదుతో
తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారని ముంబయికి చెందిన సినీ నటి జత్వానీ... గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్ వ్యవహరించిన కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నిపై ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహరంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఇబ్రహీంపట్నం పీఎస్ లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబసభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లోపాలను గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. డీజీపీ ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
వైసీపీ నేతపై కేసు నమోదు
ముంబయి నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేశారని తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలిసి ముంబయి నటి ఇటీవల ఇబ్రహీంపట్నం పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, మరికొందరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, నటిని వేధించిన పోలీసులపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వానీ కేసు అనంతరం కాకినాడ డీఎస్పీగా బదిలీ అయ్యారు. అయితే ఆమె పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో హనుమంతరావు మళ్లీ విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్‌లో కీలకంగా వ్యవహరించారు. అలాగే కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ... అసలు కేసు వివరాలను పరిశీలించకుండానే ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసి నటిని అరెస్టు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై తాజాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళను అరెస్టు చేసి వేధించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. డీజీపీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు వేసింది.
సంబంధిత కథనం