AP Employees Transfers : ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, మార్గదర్శకాలు జారీ
AP Employees Transfers : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా 15 శాఖల్లో బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ, పంచాయితీ రాజ్, గనులు సహా పలు శాఖల్లో బదిలీ చేపట్టనున్నారు.
AP Employees Transfers : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ, పంచాయితీ రాజ్, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్య పన్నులు, విద్యుత్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. 15 శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోగా ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్, మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం.
*పాత 13 జిల్లాల ప్రాతిపదికన బదిలీలు జరుగుతాయి.
*జులై 31 నాటికి ఒకే స్టేషన్ (గ్రామం / పట్టణం / నగరం) లో గరిష్టంగా ఐదేళ్లు విధులు నిర్వహిస్తే తప్పనిసరి బదిలీ, మిగతా వారు జీరో సర్వీస్స్ పై రిక్వెస్ట్ బదిలీకి అర్హులు.
*ఉద్యోగ సంఘాల నేతలు ఒకేచోట కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలి. హెచ్వోడీ, కలెక్టర్ ఇచ్చే జాబితా మేరకు వీరికి 9 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.
* 19.08.2024 నుంచి 31.08.2024 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత
*01.09.2024 నుంచి మరలా బదిలీలపై నిషేధం
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీల్లో అవకాశం
ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలు
1. ఒకే స్టేషన్ లో(గ్రామం, పట్టణం, నగరం)జులై 31, 2024 నాటికి 5 ఏళ్ల వ్యవధిని పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు.
2. ఒక స్టేషన్‌లో 5 సంవత్సరాల పాటు విధులు పూర్తి చేసిన ఉద్యోగులు కాకుండా ఇతర ఉద్యోగులు పరిపాలనా అవసరాలపై లేదా వ్యక్తిగత అభ్యర్థనపై బదిలీకి అర్హులు.
3. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సాధారణ ఎన్నికలు సమయంలో జరిగిన బదిలీలను సాధారణ బదిలీలుగా పరిగణించరు.
4. బదిలీలలో కింది వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు.
i. విజువల్ ఛాలెంజ్డ్ ఉద్యోగులు
ii. మానసిక వికలాంగులైన పిల్లలున్న వారు వైద్య సదుపాయాల కోసం బదిలీలకు అర్హులు
iii. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు
iv. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలున్న ఉద్యోగులు, వికలాంగుల నిబంధనల ప్రకారం ధృవీకరణ పొందిన వారు
v. వైద్య కారణాలపై బదిలీ కోరుకునే ఉద్యోగులు, తనకు లేదా జీవిత భాగస్వామి లేదా తనపై ఆధారపడిన పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులు క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తో బాధపడుతుంటే...వైద్య సౌకర్యాలున్న ప్రాంతాలకు బదిలీలకు అర్హులు
vi. కారుణ్య నియామకంపై నియమితులైన వితంతువులు
5. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. అయితే వారు బదిలీ కోసం అభ్యర్థన చేసుకుంటే వీలైనంత వరకు నిబంధనల మేరకు వారికి నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తారు.
6. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయిన సందర్భంలో వారిద్దరినీ ఒక స్టేషన్‌లో లేదా ఉన్న స్టేషన్‌లలో(ఒకరి దగ్గరకు మరొకరు) పోస్టింగ్ ఇస్తారు.
7. నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని పోస్ట్‌లను ముందుగా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఐటీడీఏ యేతర ప్రాంతాల్లో బదిలీ చేయాలి.
8. ITDA ప్రాంతాల బదిలీలో ముందుగా అంతర్గత, వెనుకబడిన ప్రాంతాలు ఖాళీల భర్తీ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
9.ITDA ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు (లోకల్ క్యాడర్లు, జోనల్ కేడర్లు) రెండు కంటే ఎక్కువ సంవత్సరాలకు పనిచేస్తున్న వారికి నచ్చిన స్టేషన్లకు బదిలీ చేయవచ్చు.
సంబంధిత కథనం