AP Govt : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ.3 వేల కోట్లు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల అభివృద్ధి కోసం ఒక్కో సచివాలయానికి నిధులను మంజూరు చేసింది.
ఇటీవలే గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఒక్కో సచివాలయానికి 20 లక్షల నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. తాజాగా దానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. గ్రామాల్లో సమస్యలు లేకుండా ఉండేందుకు ఈ నిధులు ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి 3 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇంటింటికి వెళ్తున్న ప్రజాప్రతినిధులకు జనాల నుంచి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. మరోవైపు నిధుల కొరత ఉందనే విషయం కూడా ఎమ్మెల్యేల మనసులో ఉంది. ఇటీవల నిర్వహించిన వర్క్ షాప్ లో సీఎం జగన్ దృష్టికి ఈ విషయం వెళ్లింది. దీంతో సచివాలయానికి 20 లక్షల చొప్పున కేటాయించనున్నట్టుగా ప్రకటించారు. తాజాగా దానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు.
ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 సచివాలయాలకు ఈ నిధులు మంజూరు అయ్యాయి. మరోవైపు గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం రూ. 3 వేల కోట్ల కేటాయించింది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు అదనంగా రూ. రెండు కోట్ల అభివృద్ధి నిధులను కూడా మంజూరు చేస్తుంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులకు అందుతున్నాయా అని అడుగుతున్నారు. ఈ నిధులతో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది.
తాజాగా 1000 కోట్ల అప్పు
తాజాగా ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద మరో వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి ఈ అప్పు సమీకరించుకుంది. 13 ఏళ్ల కాల పరిమితితో 7.72 శాతం వడ్డీకి సెక్యూరిటీలు వేలం వేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై వరకూ రాష్ట్ర ప్రభుత్వం 21 వేల 500 కోట్ల రూపాయల రుణం అందుకుంది.