AP EAPCET Counselling : ఏపీ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చిందోచ్, ముఖ్య తేదీలివే!
AP EAPCET Counselling : ఏపీ ఈఏపీ సెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
AP EAPCET Counselling : విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.ఇంజినీరింగ్ ప్రవేశాలు కోసం ఏపీ ఈఏపీ సెట్ 2023 షెడ్యూల్ ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి మంగళవారం విడుదల చేశారు. ఈఏపీ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ లోపు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. జులై 25వ తేదీ నుంచి ఆగస్టు 4 వరకు సహాయ కేంద్రాల వద్ద ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 3న తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆప్షన్ల మార్పు కోసం ఆగస్టు 9వ తేదీన ఒక రోజు మాత్రమే అవకాశం ఉంటుందని, ఆగస్టు 12న సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతామని కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు. విద్యార్థులు ఆగస్టు 13, 14 తేదీలలో వ్యక్తిగతంగా సీట్లు పొందిన కళాశాలల్లో రిపోర్టు చేయాలని, ఆగస్టు 16వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. పూర్తి వివరాలు, సహాయ కేంద్రాల సమాచారం కోసం cets.apsche.ap,gov.in వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు.
ముఖ్యమైన తేదీలు
- జులై 24-ఆగస్టు 3 వరకు : ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు
- జులై 25 - ఆగస్టు 4 వరకు : ధృవీకరణ పత్రాల పరిశీలన
- ఆగస్టు 3- 8వ తేదీ వరకు : వెబ్ ఆప్షన్లు
- ఆగస్టు 9 : వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు
- ఆగస్టు 12 : సీట్ల కేటాయింపు
- ఆగస్టు13-14 : కళాశాలల్లో రిపోర్టు చేయాలి
- ఆగస్టు 16 : తరగతులు ప్రారంభం
ఈ ఏడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ కు 3,14,797 మంది హాజరయ్యారు. వీరిలో 2,52,717 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,71,514 మంది విద్యార్ధులు (76.32 శాతం), అగ్రికల్చర్ విభాగంలో 81,203 మంది (89.65 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఈఏపీ సెట్‌కు ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2,07,787 మంది అభ్యర్థులు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 1,10,887, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 16,056, నాన్ లోకల్ విభాగంలో 4009 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఓసీలు 1,05,556, బీసీ-ఏ 46,864, బీసీ- బీ2,221, బీసీ-సీ 61,126, బీసీ-డీ 17,235, బీసీ-ఈ 53,521 , ఎస్సీ, ఎస్టీలు కలిపి 11,383 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 10న, 2023న ఏపీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు తెలుగు రాష్ట్రాల్లో 25 జోన్లుగా విభజించి 136 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.