CBN In Srisailam: శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ సీఎం చంద్రబాబు, సుప్రీం తీర్పును స్వాగతించిన బాబు
CBN In Srisailam: ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్నారు. ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును బాబు స్వాగతించారు.
CBN In Srisailam: ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో ప్రదక్షణలు చేసి అనంతపరం మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రిగా శ్రీశైలం తొలిసారి వచ్చిన బాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. చంద్రబాబు నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
శ్రీశైలంలో కొనసాగుతున్న వరద ఉధృతి…
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,42,026 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,78,172 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరింది.
కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం మల్లన్న దర్శనం తర్వాత శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలించనున్నారు. కృష్ణానదికి ముఖ్యమంత్రి జలహారతులు ఇవ్వనున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి వాయనం సారె సమర్పించనున్నారు. ఏపీ జెన్ కో కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. సున్నిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా వేదికలో పాల్గొని స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను చంద్రబాబు తెలుసుకోనున్నారు.
టీడీపీ అంటేనే సామాజిక న్యాయం
సుప్రీం కోర్టు ఏబిసిడి వర్గీకరణ సరైనదని చెప్పడాన్ని ఏపీ సిఎం చంద్రబాబు స్వాగతించారు. సామాజిక న్యాయం టీడీపీ సిద్ధాంతమని, అందరికీ న్యాయం జరగాలని, 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఏబిసిడి వర్గీకరణ తానే తెచ్చానని బాబు గుర్తు చేశారు.
ఇప్పుడు దానిని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గుర్తించిందని, జనాభా దామాషా ప్రకారం ప్రతికులానికి న్యాయం చేయడం తమ పార్టీ విధానం అని సున్నిపెంటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.