Margadarsi Chits: మార్గదర్శి చిట్స్ కేసులో శైలజా నివాసంలో సోదాలు…
Margadarsi Chits: మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో ఏపి సిఐడి దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో సంస్థ ఎండి శైలజ నివాసానికి సిఐడి అధికారులు చేరుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు, భారీ బందోబస్తు నడుమ శైలజను పశ్నిస్తున్నారు.
Margadarsi Chits: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో ఎండి శైలజా కిరణ్‌ను ఏపీ సిఐడి ప్రశ్నిస్తోంది. మార్గదర్శిచిట్‌ఫండ్స్ వ్యవహారంలో అక్రమ లావాదేవీలు,చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, బ్యాంకు లావాదేవీల నిర్వహణపై ఏపి సిఐడి కేసులు నమోదు చేసింది. మార్గదర్శి సంస్థలో అక్రమాలపై ఈనాడు గ్రూప్ సంస్థల యజమాని రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజా, మార్గదర్శి సంస్థలపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది.
ఏపీ సిఐడి నమోదు చేసిన కేసుల వ్యవహారంలో వివరణ ఇవ్వాలని గత వారం నోటీసులు జారి చేశారు. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిటర్ల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించడం, అక్రమంగా డిపాజిట్లు సేకరించడం వంటి వ్యవహారాలపై సిఐడి దర్యాప్తు జరుపుతోంది.
దర్యాప్తులో భాగంగా రామోజీరావుతో పాటు, శైలజాను విచారించాలని సిఐడి భావించింది. చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఖాతాదారుల సొమ్మును డిపాజిట్లుగా సేకరించడంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి జరిపిన సోదాల్లో నలుగురు మార్గదర్శి ఉద్యోగులను కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు మార్గదర్శి ఆడిట్ వ్యవహారాలు చూసిన బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ ఆడిటర్ శ్రావణ్‌ను కూడా అరెస్ట్ చేశారు.
మార్గదర్శి వ్యవహరంలో సిఐడి నోటీసుల నేపథ్ంలో హైదరాబాద్‌లోని శైలజా నివాసంలో సంస్థ ఎండి శైలజాను విచారిస్తున్నారు. బ్యాలెన్స్ షీట్ నిర్వహించకపోవడంతో పాటు చిట్ గ్రూప్స్‌కు సంబంధించిన ఫారం 21ను కూడా మార్గదర్శి సంస్థ సమర్పించలేదని సిఐడి ఆరోపిస్తోంది. మార్గదర్శి సంస్థపై ఐపిసి సెక్షన్లు 420, 409, 120బి, 477 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై విచారణకు హాజరు కావాలంటూ మార్గదర్శి ఎండీ, రామోజీ కోడలు చెరుకూరి శైలజకు ఏపీ సిఐడి గత వారం నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలపై కొద్ది నెలల క్రితం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖతో పాటు ఏపీ సిఐడి మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో తాజాగా మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌కు సిఐడి నోటీసులు జారి చేసింది.
ప్రభుత్వ తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడైంది చిట్ ఫండ్స్ రెగ్యులేటరీ యాక్ట్‌కు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ ఉమ్మడి ఖాతాను నిర్వహించడం, చీటీ పాటల సొమ్మును ఒకే ఖాతాకు బదలాయించడం, ఖాళీగా ఉన్న చిట్లలో సొమ్మును ఎగవేయడం, బ్యాంకు ఫోర్‌మెన్‌తో సంబంధం లేకుండా ఏకీకృత ఖాతాలో లావాదేవీలు నిర్వహించడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది. మరోవైపు మార్గదర్శి సంస్థపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. మార్గదర్శిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా మార్గదర్శి ఎండికి ఏపీ సిఐడి నుంచి నోటీసులు అందచేశారు.