IPS Officers : పీవీ సునీల్ కుమార్‌కు.. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు!
IPS Officers : ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు.. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా నిలిచారు. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముందని ప్రశ్నించారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నాని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.. కొంత మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టింది. వారికి కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా నిలిపివేసింది. గత వైసీపీ పాలనలో ఏ అధికారులైతే ఉన్నత స్థానంలో ఉన్నారో.. ఎవరైతే క్రీయాశీలకంగా వ్యవహరించారో ఆ అధికారులను టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిగా పక్కన పెట్టింది.
అయితే కొంత మందికి పోస్టింగ్ ఇచ్చినా.. అప్రాధాన్యత విభాగాల్లోనే ఇచ్చారు. శ్రీలక్షీ లాంటి ఐఏఎస్ అధికారులు పూల బోకే ఇచ్చిన తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాకరించారు. ఇంటెలిజెన్సీ చీఫ్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు సీఎం చంద్రబాబును కలవడానికి ప్రయత్నించినప్పటికీ.. అపాయింట్‌మెంట్ దొరకలేదు. రెండు మూడు సందర్భాల్లో చంద్రబాబును కలవడానికి వెళ్లినప్పటికీ సెక్యూరిటీ అనుమతించలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్, ఎన్.సంజయ్‌తో సహా 23 మందిని, సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి, రంజత్ భార్గవ్ వంటి 10 మందికి పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని సాధారణ పరిపాలన శాఖ (జీఏడి)కి రిపోర్టింగ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే.. ఆ తరువాత కొంత మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటికీ శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రంజత్ భార్గవగా పోస్టింగ్ ఇవ్వలేదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని సెలవులపై పంపారు. ఆ తరువాత ఆయన పదవీ విరమణ చేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీన్ని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వెంటనే, గోపాలకృష్ణ ద్వివేదికి పోస్టింగ్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆయనను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
అలాగే తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన డి. హరితను వెయిటింగ్‌లో పెట్టారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమెను అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను కూడా 24 గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. ఆమెకు మళ్లీ నెల రోజుల తరువాత పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రీలివ్ చేయకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తమను రిలీవ్ చేయాలని అధికారులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు.
టీటీడీ ఈవో సెలవుపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం తిరస్కరించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాతృ సంస్థకు వెళ్లాలని దరఖాస్తు చేసుకోగా, ఏపీ నుంచి తనను రిలీవ్ చేయాలని గనుల శాఖ ఎండీ వెంకట్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి తమ మాతృ సంస్థలకు పంపాలని దరఖాస్తు చేసుకున్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వరర్ రెడ్డిలు ఏపీ నుంచి రిలీవ్ చేయాలని కోరుకున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా తెలంగాణకు వెళ్తానని దరఖాస్తు చేసుకున్నారు. వారెవ్వరికీ అనుమతి ఇవ్వలేదు.
అయితే.. 23 మంది ఐపీఎస్‌ల్లో 16 మంది ప్రతి రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వచ్చి, అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి ఆఫీసర్ వెయిటింగ్ రూమ్‌లో రోజంతా ఉండాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. 16 మందిలో పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, ఎన్.సంజయ్, జి.పాలరాజు, కొల్టి రఘురామరెడ్డి, ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, సీహెచ్ విజయారావు, విశాల్ గున్ని, కేకేఎన్ అన్బురాజన్, వై.రవిశంకర్ రెడ్డి, వై.రిషాంత్ రెడ్డి, కె.రఘువీరా రెడ్డి. పి.పరమేశ్వర్ రెడ్డి. పి.జోషువా, కృష్ణకాంత్ పటేల్, కాంతి రాణా టాటా ఉన్నారు.
ఇటు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి వంటి కొంత మంది అధికారులపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కాదంబరీ జెత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ అధికారులపై విచారణ జరుగుతోంది. నాటి ఇంటెలిజెన్స్ డీసీ సి.సీతారామంజనేయులు, విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
పోస్టింగ్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌పై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన పోస్టుపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టులో మూడేళ్లు నడిచి, తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.. అంటూ సునీల్ ట్వీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై పీవీ సునీల్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై క్రమ శిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ ఇష్యూపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పీవీ సునీల్ కుమార్‌కు మద్దతు ఇచ్చారు. "సోదరులు, సాటి అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దాడిని పూర్తిగా ఖండిస్తున్నా. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముంది? ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూలు ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం ఐతదేమో!" అని ట్వీట్ చేశారు. "మీరు ఇలాగే మంత్రగత్తె వేటను కొనసాగిస్తే, ఆల్-ఇండియా సర్వీసెస్ (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్) సభ్యులెవరూ ప్రజల కోసం పని చేయడాన్ని ఆనందించరు. అనుభవజ్ఞుడైన అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో ఇలాంటి దురాగతాలన్నీ నిరాటంకంగా జరగడం బాధాకరం" అని ఆర్ఎస్పీ వ్యాఖ్యానించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)