APPSC AR Anuradha: రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి ఏఆర్ అనురాధకు ఏపీపీఎస్సీ బాధ్యతలు? రేసులో ఠాకూర్‌, సంతోష్ మెహ్రా..-appsc responsibilities for retired ips officer ar anuradha ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Ar Anuradha: రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి ఏఆర్ అనురాధకు ఏపీపీఎస్సీ బాధ్యతలు? రేసులో ఠాకూర్‌, సంతోష్ మెహ్రా..

APPSC AR Anuradha: రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి ఏఆర్ అనురాధకు ఏపీపీఎస్సీ బాధ్యతలు? రేసులో ఠాకూర్‌, సంతోష్ మెహ్రా..

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 01, 2024 09:47 AM IST

APPSC AR Anuradha: ఏపీపీఎస్పీ బాధ్యతల్ని గాడిన పెట్టాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ బాధ్యతల్ని సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం గాలిస్తోంది. ఈ క్రమంలో రిటైర్డ్‌ పోలీస్ అధికారిణి ఏఆర్.అనురాధకు ఏపీ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ బాధ్యతల్ని అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఏపీపీఎస్సీ ఛైర్‌ పర్సన్‌గా  రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌.అనురాధ
ఏపీపీఎస్సీ ఛైర్‌ పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌.అనురాధ

APPSC AR Anuradha: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యతల్ని రిటైర్డ్‌ పోలీస్ అధికారిణి ఏఆర్‌.అనురాధకు అప్పగించనున్నారు. ఏపీ క్యాడర్‌ల చైర్పర్సన్గా విశ్రాం త ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, సంతోష్ మెహ్రా పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. 

ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారిగా గుర్తింపు పొందార. డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా పనిచేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి.

ఏపీపీఎస్సీ బాధ్యతలను అప్పగించే విషయంలో పలు పేర్లను పరిశీలించిన తర్వాత అనురాధ నియామకానికి ప్రభుత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫైలును సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు ప్రచారం జరుగుతోంది. అనురాధ నియామకానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సుముఖత తెలపడంతో ఆమె నియామకం లాంఛనమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపించింది. గ్రూప్‌ 1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని, తమకుకావాల్సిన వారికి మేలు చేసేందుకు ఒకటికి మూడు సార్లు మూల్యంకనం చేశారని టీడీపీ పలుమార్లు ఆరోపించింది. ప్రభుత్వం మారిన వెంటనే గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. మరో ఏడాది పదవీ కాలం ఉన్నా సవాంగ్‌ ఏపీపీఎస్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత మూడు నెలలుగా ఏపీపీఎస్సీకి చైర్మన్ లేకుండా పోయింది. మరోవైపు కొత్త నోటిఫికేషన్లు ముందుకు కదలడం లేదు. ఇప్పటికే ప్రకటించిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిలిచిపోయాయి. మరి కొన్ని పరీక్షల తేదీలు కూడా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని ఆసక్తికరమైన చర్చ జరిగింది.

ఏపీపీఎస్సీ రేసులో పలువురి అధికారుల పేర్లు వినిపించాయి. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య, పోలా భాస్కర్ పేర్లు వినిపించాయి. కేరళలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్, గతంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో వైస్ చాన్సలర్ పనిచేసిన అప్పారావు, యలమంచిలి రామకృష్ణ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఏపీపీఎస్సీ ప్రతిష్టను ఇనుమడింప చేయడం, పరీక్షల నిర్వహణ ఉద్యోగ నియామకాలు వివాదాలకు తావు లేకుండా చేపట్టే క్రమంలో ఏఆర్ అనురాధకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతున్నారు.

మరోవైపు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి కోసం మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ ఉన్నారు. ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించారు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్పీ ఠాకూర్‌ కీలకంగా వ్యవహారిస్తున్నారు. ఆయన పేరును కూడా ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ రేసులో పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు సంతోష్ మెహ్రా.. వైసీపీ హయంలో వేధింపులకు గురైనట్టు గతంలో ఆయన ఆరోపించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే అధికారిగా మెహ్రాకు గుర్తింపు ఉంది.