AP Bureaucrats: రాజకీయ నాయకుల కంటే దారుణంగా ఏపీ బ్యూరోక్రాట్లు.. సిఎంను ప్రసన్నం చేసుకోడానికి తంటాలు-ap bureaucrats are worse than politicians ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bureaucrats: రాజకీయ నాయకుల కంటే దారుణంగా ఏపీ బ్యూరోక్రాట్లు.. సిఎంను ప్రసన్నం చేసుకోడానికి తంటాలు

AP Bureaucrats: రాజకీయ నాయకుల కంటే దారుణంగా ఏపీ బ్యూరోక్రాట్లు.. సిఎంను ప్రసన్నం చేసుకోడానికి తంటాలు

Sarath chandra.B HT Telugu
Jun 15, 2024 11:46 AM IST

AP Bureaucrats: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు అధికారులు వ్యవహరిస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతామనే భయంతో చంద్రబాబును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అధికారుల తంటాలు
చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అధికారుల తంటాలు

AP Bureaucrats: రాజకీయ పార్టీల్లో కప్పదాట్లు, ఫిరాయింపులు సహజమే అయినాsa ఏపీ ప్రభుత్వ అధికారుల్లో మాత్రం అంతకు మించిన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీతో అంటకాగి, పార్టీ కార్యకర్తలకు మించి స్వామి భక్తిని ప్రదర్శించిన అధికారులు ఇప్పుడు మళ్లీ కండువాలు మార్చాల్సిన అవసరం లేకపోవడంతో కొత్త ప్రభుత్వం భజన ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు సమర్థత, సామర్థ్యాల గురించి అడిగిన వారికి అడగని వారికి చెబుతున్నారు.

ఇన్నాళ్లు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే సంగతి మర్చిపోయిన శాఖాధిపతులు, కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు నిస్సిగ్గుగా కొత్త పార్టీ అధికారంలోకి రాగానే భజన ప్రారంభించారు. తమకు తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వైసీపీ వైఫల్యంలో కీలక పాత్ర పోషించిన అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. తాము అసలైన టీడీపీ అభిమానులమని, ఒత్తిడితోను గతంలో అలా చేశామని వివరణ ఇచ్చుకుంటున్నారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అధికారులు కొంత తటస్థ వైఖరి అవలంబించారు. ఈ క్రమంలో అనుకున్న పనులు పూర్తి చేయాలంటే తమ వారే అయా శాఖల్లో ఉండాలనే కిటుకును నాటి ప్రభుత్వం గుర్తించింది. దీంతో పోస్టింగ్ కావాలంటే తాము చెప్పినట్టు చేయాలనే అస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు మొదలుకుని గ్రూప్‌ వన్ సర్వీస్ అధికారుల వరకు అంతా ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు. చెప్పిన పని చేయడం కోరిన పోస్టింగ్ తెచ్చుకోవడానికి అలవాటు పడ్డారు. నిబంధనలు పాటించే వారు, రూల్స్ ఫాలో అయ్యే వారిని పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం, ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించడం చేశారు.

అధికారంలోకి రాగానే సరెండర్...

2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చూసిన అధికారులు వైసీపీ ముఖ్య నాయకుల్ని కలిసి తాము ముఖ్యమంత్రి స్థానానికి విధేయులమని, ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తామని, తమకు గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వాలని వేడుకున్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మహిళా అధికారిణి ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి గిట్టని పత్రికలు తన శాఖ పరిధిలో ఎక్కడా కనిపించడానికి వీల్లేదని అధికారికంగా ఆదేశాలు జారీ చేసి, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి లిఖితపూర్వకంగా పంపాలని సూచించారు. తద్వారా కొత్త ప్రభుత్వం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడానికి నిస్సంకోచంగా ప్రవర్తించారు.

2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు తమకు ప్రభుత్వ నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుని మళ్లీ వైసీపీలో హవా కొనసాగించారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సతీష్‌ చంద్ర వంటి అధికారులు కూడా పాత ప్రభుత్వంలో లొసుగుల్ని వెల్లడించి కొత్త ప్రభుత్వంలో కూడా అదే జోరుతో పనిచేశారు. 100శాతం సంతృప్తి, ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన వంటి నివేదికలతో చంద్రబాబును పూర్తిగా మభ్య పెట్టిన ఓ అధికారి జగన్ ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు మనిషిగా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కళ్లకు పూర్తిగా గంతలు కట్టిన బ్యాచ్ మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది.

ఆలిండియా సర్వీస్ కాస్త పొలిటికల్ సేవగా...

ఆలిండియా సర్వీస్ అధికారులుగా విధానపరమైన నిర్ణయాల్లో తప్పొప్పుల్ని సూచించి పాలనలో మార్గదర్శకంగా నిలవాల్సిన అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేలా ముఖ్యమంత్రుల్ని, ప్రభుత్వాల్ని తప్ప దోవడ పట్టించడంలో కీలకంగా వ్యవహరించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని రకాలుగా అధికారాన్ని అనుభవించి ప్రభుత్వ ఓటమి పాలవడానికి తమ వంతు కృషి చేసిన అధికారులంతా మళ్లీ తాము మీ మనుషులమేనంటూ దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి కమిషన్లు దండుకోవడమే లక్ష్యంగా పనిచేసిన స్టేట్ క్యాడర్ అధికారులు కూడా ఇప్పుడు మళ్లీ మంత్రులు, ముఖ్యమంత్రి వద్ద క్యూ కడుతున్నారు.

బోకేలు, శాలువాలతో దండాలు పెడుతున్నారు. ప్రభుత్వాలు మారిన తమకేంటి రిటైర్మెంట్ వరకు డోకా లేదని భావిస్తున్నారు. ఐదేళ్లు ఏదోలా పబ్బం గడుపుకోవడమే లక్ష్యంగా చక్కర్లు కొట్టే అధికారులు సెక్రటేరియట్‌లో దర్శనం ఇస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం