ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ పవర్‌హౌస్‌గా అవతరిస్తుంది - సెల్‌కాన్ గ్రూప్ ఛైర్మన్ వై. గురు
Celkon Group CMD Meet IT Minister Lokesh : ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తో సెల్‌కాన్ గ్రూప్ సీఎండీ వై.గురు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఏపీని ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని వై.గురు చెప్పారు.
Celkon Group CMD Meet IT Minister Lokesh : ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పవర్‌హౌస్‌గా ఎదిగే అవకాశం ఉందని సెల్కాన్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండీ వై గురు అన్నారు. గురువారం రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ తో ఆయన సమావేశమయ్యారు. ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ కు అభినందనలు తెలిపారు.
ప్రణాళికలు సిద్ధం…
ఈ సందర్భంగా సెల్కాన్ గ్రూప్ ఛైర్మన్ వై. గురు మాట్లాడుతూ…. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీలో తమ సంస్థ పెట్టుబడులు పెట్టడంపై వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఎలాక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో ఏపీని పవర్ హౌస్ గా తీర్చించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఐటీ మంత్రి లోకేశ్ తో జరిగిన భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు లోకేశ్ తో వై. గురు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రముఖ హబ్‌గా మార్చేందుకు పూర్తిగా సమాయత్తం అవుతున్నామని చెప్పినట్లు వెల్లడించారు.
2019 నాటికి దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 2024 నాటికి 115 బిలియన్ డాలర్లకు చేరుకుందని సెల్కాన్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండీ వై గురు అన్నారు. రానున్న సంవత్సరాల్లో 300 బిలియన్ డాలర్లకు చేరుకోబోతుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనుకూలమైన విధానాలే ఈస్థాయి వృద్ధికి కారణమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎలాక్ట్రానిక్స్ తయారీ రంగంలో నమోదవుతున్న వృద్ధి రేటులో ఏపీ నుంచి అగ్రభాగం ఉండటమే తమ లక్ష్యమని ఐటీ మంత్రి లోకేశ్ చెప్పారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తోందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు. “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమర్ధవంతమైన నాయకుడు. దూరదృష్టితో ఆలోచించే చంద్రబాబు నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం నుంచి మాకు పూర్తి మద్దతు ఉంది" అని అన్నారు. ఏపీలోని యువ ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ముందుకెళ్తామని పంకజ్ మొహింద్రూ చెప్పారు.