Andhra Pradesh Tableau : గణతంత్ర దినోత్సవం.. ఏపీ శకటం ప్రభల తీర్థం..
Andhra Pradesh Tableau : ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో... ఏపీ శకటం కనువిందు చేయనుంది. ప్రభల తీర్థం ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్ శకటం.. ఆకట్టుకోనుంది. ఈ మేరకు మొత్తం 17 రాష్ట్రాల శకటాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయని కేంద్రం వెల్లడించింది.
Andhra Pradesh Tableau : గణతంత్ర దినోత్సవం అనగానే.. అందరికీ ఢిల్లీలో నిర్వహించే వేడుకలు గుర్తుకు వస్తాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించే రిపబ్లిక్ డే ఉత్సవాలు.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. సైనిక ప్రదర్శనలు, యుద్ధ విమానాల విన్యాసాలు, సైనికుల కవాతు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ, సంప్రదాయాలను చాటే శకటాలు... అందరినీ ఆకట్టుకుంటాయి. గణతంత్ర దినోత్సవాల్లో తమ శకటాలు ప్రదర్శించేందుకు రాష్ట్రాలు ఆసక్తి చూపుతాయి. ఆయా రాష్ట్రాలు... వేడుకలకు నాలుగు నెలల ముందుగానే శకటాలపై ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతాయి. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.. ప్రదర్శనకు ఎంపికైన శకటాల జాబితాను కేంద్రం ప్రకటిస్తుంది. ఎంపికైన రాష్ట్రాల శకటాలు... గణతంత్ర దినోత్సవం వేడుకల్లో సందడి చేస్తాయి.
ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది జనవరి 26న జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపికైన శకటాల జాబితాను... కేంద్రం ఆదివారం వెల్లడించింది. మొత్తం 23 ఆకృతులు.. ఉత్సవాల్లో సందడి చేస్తాయని పేర్కొంది. ఇందులో 17.. రాష్ట్రాల నుంచి కాగా.. మరో 6 వివిధ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని శాఖలు, విభాగాల నుంచి ఎంపికయ్యాయి. కాగా.. ఈ సారి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం కూడా ఎంపిక అయింది. వివిధ రాష్ట్రాల మధ్య పోటీలో ప్రభల తీర్థం ఇతివృత్తంతో కూడిన ఏపీ శకటం ఎంపికైంది. దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు శకటాలే.. రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనున్నాయి. ఎంపికైన శకటాలకు.. ఢిల్లీలోని రాష్ట్రీయ రంగశాల క్యాంపులో తుది మెరుగులు దిద్దుతున్నారు.
ప్రభల తీర్థానికి ఏపీలో చాలా విశిష్టత ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తీర్థాలను ప్రదర్శిస్తారు. వీటన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది కొనసీమలోని జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. సంప్రదాయబద్ధంగా ప్రభలను రూపొందించి.. మేళతాళాలు, మంగళ వాద్యాలతో ఊరేగింపుగా వెళతారు. ఎంత దూరమైనా భక్తులు భూజాల మీదనే ప్రభలను మోస్తారు. ముఖ్యంగా కనుమ రోజు కోనసీమలో జరిగే ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సాంప్రదాయంగా ఇంతటి విశిష్టత ఉన్నందునే... ప్రభల తీర్థం ఇతివృత్తంతో శకటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా... కేంద్రం ఆమోదించింది. రిపబ్లిక్ డే పరేడ్ లో.. ప్రపంచం మొత్తానికి ఏపీ సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ... ప్రభల తీర్థం శకటం సందడి చేయనుంది.
కాగా.. రాష్ట్రం తరపున శకటం ప్రదర్శనకు తెలంగాణ సర్కార్ ఈ సారి కూడా ప్రతిపాదనలు పంపకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శకటాలు పాలుపంచుకున్నాయి. 2015లో బోనాలు, 2020లో బతుకమ్మ, వేయిస్తంభాల ఆలయం, మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ధీమ్ లతో కూడిన శకటాలు కనువిందుచేశాయి. 2022లో ఎలాంటి ప్రతిపాదనలు పంపని రాష్ట్ర సర్కార్.. ఈ ఏడాది కూడా విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి.