Governor AT HOME: ఎట్‌ హోమ్‌లో కూడా అధికారుల అదే కక్కుర్తి.. ప్రోటోకాల్ అధికారుల నిర్వాకం-andhra pradesh officials same attitude in governors at home program ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Governor At Home: ఎట్‌ హోమ్‌లో కూడా అధికారుల అదే కక్కుర్తి.. ప్రోటోకాల్ అధికారుల నిర్వాకం

Governor AT HOME: ఎట్‌ హోమ్‌లో కూడా అధికారుల అదే కక్కుర్తి.. ప్రోటోకాల్ అధికారుల నిర్వాకం

Sarath chandra.B HT Telugu
Aug 16, 2024 08:56 AM IST

AT HOME: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమంలో నాసిరకం ఆహారపదార్ధాలను అందించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రోటోకాల్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లపై ముందెన్నడు లేని విధంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఏపీ గవర్నర్‌ ఎట్ హోమ్  కార్యక్రమ నిర్వహణపై విమర్శలు
ఏపీ గవర్నర్‌ ఎట్ హోమ్ కార్యక్రమ నిర్వహణపై విమర్శలు

AT HOME: ఏపీ రాజ్‌భవన్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. అతిథులకు ఆహ్వానం పలకడం నుంచి ఆతిథ్యం వరకు ప్రోటోకాల్ అధికారుల నిర్వాకం స్పష్టమైంది. ఏటా స్వాతంత్య్ర దినోత్సం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా గవర్నర్‌ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులకు ఆహ్వానం లభిస్తుంది.

సాధారణంగా గవర్నర్ స్థాయి వ్యక్తులు సాధారణ ప్రజానీకంతో కలిసేందుకు ఎప్పుడో కానీ అవకాశం లభించింది.ప్రభుత్వాలను వెనుక ఉండి నడిపించే గవర్నర్‌ కార్యాలయంలో.. ఎట్‌ హోం కార్యక్రమాల ద్వారా అన్ని స్థాయిల వారితో ముఖాముఖి కలిసేందుకు అవకాశం ఉంటుంది.

ప్రభుత్వంలో కీలకంగా ఉండే అధికారులు, మంత్రులు , న్యాయమూర్తులు వంటి వారు గవర్నర్‌తో ముఖాముఖి కలిసేందుకు అవకాశమున్నా మిగిలిన వారికి గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించడం అంత సులువు కాదు. దీంతో వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు గవర్నర్‌ను ముఖాముఖి కలిసేందుకు ఎట్‌ హోమ్ కార్యక్రమాన్ని ఎంచుకుంటారు. సమాజంలో గుర్తింపు ఉన్న వారు, సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు, అయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎట్ హోం కార్యక్రమాలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తుంటారు.

ఏపీలో కొన్నేళ్లుగా ఎట్‌ హోమ్ నిర్వహణ ప్రహసనంగా మారింది. అతిథుల ఆహ్వానం మొదలుకుని, కార్యక్రమం నిర్వహణ వరకు రకరకాల ఆరోపణలు ఉన్నాయి. గురువారం జరిగిన ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, హైకోర్టు సీజేతో పాటు ఇతర న్యాయమూర్తులు, మంత్రులు నారా లోకేష్‌,డీజీపీ, సీఎస్‌, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల,సిపిఐ రామకృష్ణ, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ వర్గాలకు చెందిన వందలాది మందిని రాజ్‌భవన్‌ తరపున ఆహ్వానించారు.

అవే బోకేలు మళ్లీమళ్లీ అందరికి...

ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ కార్యాలయ అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికే క్రమంలో సీఎం చేతికి అందించిన బోకేను భద్రతా సిబ్బంది తీసుకుని అక్కడ ఉన్న సహాయకుల చేతికి అందించారు. సీఎం కారులోనే వచ్చిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మరోవైపు నుంచి కిందకు దిగారు. ఆమెకు ఆహ్వానం పలికిన కృష్ణా జిల్లా కలెక్టర్ అంతకు ముందు చంద్రబాబుకు ఇచ్చిన బోకేను అందుకుని భువనేశ్వరి చేతికి ఇచ్చారు. ఇదంతా లైవ్‌లో ప్రసారమైంది. గవర్నర్ నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, హైకోర్టు సీజే ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎట్‌ హోమ్ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన వారిని గవర్నర్ పలకరించారు.

హై-టీలో పునుగులు, వడలు...

ఇక హైటీలో అతిథులుగా అందించిన ఆహారం నాణ్యతపై కూడా విమర్శలు వచ్చాయి. కనీస నాణ్యత లేని పదార్ధాలను అతిథులకు రాజ్‌భవన్‌లో అందించారు. వందలాది మంది పాల్గొన్న కార్యక్రమంలో మంత్రులు, న్యాయ మూర్తులు, ఆలిండియా సర్వీస్‌ అధికారులకు ఓ రకం పదార్ధాలను మిగిలిన వారికి మరో రకం అందించినట్టు తెలుస్తోంది.

పునుగులు, వడలు మరీ నాసిరకంగా ఉండటంతో వాటిని తినలేకపోయినట్టు ఎట్‌ హోం కార్యక్రమంలో పాల్గొన్న వారు వివరించారు. చాలామందికి అవి కూడా అందలేదని తెలిపారు. గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి లక్షల రుపాయలు ఖర్చు చేస్తారు. వివిఐపి కార్యక్రమాల్లో చేసే ఖర్చులకు లెక్కేం ఉండదు. ఎట్ హోం వంటి కార్యక్రమాలైతే కొందరు అధికారులకు కాసుల గలగలలు వినిపిస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎట్‌ హోం కార్యక్రమాలను జిఏడి ప్రోటోకాల్‌ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తారు. కార్యక్రమ ఏర్పాట్లపై గవర్నర్ పేషీ అధికారుల వద్దే పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

చల్లారిపోయిన ఆహారపదార్ధాలు కనీసం రోడ్లపై విక్రయించే నాణ్యత కూడా లేవని పెదవి విరుపులు వ్యక్తం అయ్యాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు పాల్గొనే కార్యక్రమాల్లో సైతం అధికారులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.మరోవైపు ఎట్‌ హోమ్‌ ఆ‌హ్వానాల విషయంలో కూడా పైరవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.