Alla Nani : చంద్రబాబు సమక్షంలో.. టీడీపీలో చేరనున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
Alla Nani : ఏలూరు జిల్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇవాళ సైకిల్ పార్టీలో చేరనున్నారు. ఆయన రాకను స్థానిక టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నాని తమకు క్షమాపణలు చెప్పాకే.. పార్టీలో చేరాలని డిమాండ్ చేశారు. అయినా నాని రాకకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇవాళ టీడీపీలో చేరనున్నారు. సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు సమక్షంలో చేరిక ఉండనుంది. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఏలూరు జిల్లా నేతలకు టీడీపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల్లోనే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆళ్ల నాని.
2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని ఓడిపోయారు. ఓటమి తర్వాత నాని జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే టీడీపీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నానికి జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న బడేటి చంటి నాని రాకపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. కానీ.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం నాని చేరికను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని తమను ఇబ్బందులకు గురిచేశారని.. లోకల్ టీడీపీ లీడర్లు చెబుతున్నారు. అయితే వారిని సముదాయించి నాని పార్టీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
నానికి మంచి సంబంధాలు..
ఆళ్ల నానికి వైసీపీలోని కీలక నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. అందుకే తొలి దశలో ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఎందరో కీలక నేతలు ఉన్నా.. నాని మాటకే జగన్ ప్రాధాన్యత ఇచ్చేవారని అక్కడి ప్రజాప్రతిధులు చెబుతారు. అటు వైసీపీలో మరో కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా నాని అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
వైసీపీ ఖాళీ..
కూటమి అధికారంలోకి వచ్చాక.. ఏలూరు జిల్లా వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. కీలక నేతలు అందరూ అటు జనసేనలోనో.. ఇటు టీడీపీ లోనే జాయిన్ అయ్యారు. దీంతో హౌస్ ఫుల్ అయ్యింది. ఇక స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా అధికార కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీకి రాజీనామా చేశారు.