CM Chandrababu On Rains : వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపండి- సీఎం చంద్రబాబు ఆదేశాలు-amravati cm chandrababu review on ap heavy rains situation suggested send alert message to people ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu On Rains : వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపండి- సీఎం చంద్రబాబు ఆదేశాలు

CM Chandrababu On Rains : వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపండి- సీఎం చంద్రబాబు ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 08, 2024 05:47 PM IST

CM Chandrababu On Rains : వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ పరిస్థితి అర్థం చేసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపండి- సీఎం చంద్రబాబు
వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపండి- సీఎం చంద్రబాబు

CM Chandrababu On Rains : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను టెలీకాన్ఫరెన్స్ లో కలెక్టర్లు సీఎంకు వివరించారు. తమ తమ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను సీఎంకు తెలియజేశారు. సీఎం చంద్రబాబు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. జిల్లాల్లో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు

"నేడు, రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ఏలేరు రిజర్వాయర్ కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలి. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలి. భారీ, అతిభారీ వర్షాలు పడేందుకు అవకాశం ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంప్ లకు సిద్ధంగా ఉండాలి. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలి. ముందస్తు చర్యలతో ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు"- సీఎం చంద్రబాబు

పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించవచ్చని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీంను సంప్రదించాలన్నారు. ఏజెన్సీలో భారీ వర్షాలు, వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపించాలని సూచించారు.

నిమజ్జన సమయంలో జాగ్రత్తలు

వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఆంక్షలు విధించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. వినాయకుని నిమజ్జనానికి కూడా వెళ్లి ప్రమాదం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2 వేల మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం అందిస్తున్నామన్న ఏలూరు జిల్లా కలెక్టర్ సీఎంకు వివరించారు. విజయనగరం జిల్లాలో నిన్న, ఇవాళ భారీ వర్షాలున్నాయని, దానికి అనుగుణంగా రాకపోకలను బ్రిడ్జిలపై నియంత్రిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

బాపట్ల జిల్లాలో పునరావాస కేంద్రాల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. 8 రోజులుగా విజయవాడలో వరద పరిస్థితులు, ప్రజల కష్టాలను, సహాయ చర్యలను చూస్తున్నారని, దానికి తగ్గట్లుగా సంసిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా స్థాయిలో తీసుకునే చర్యలకు అప్పటికప్పుడే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత కథనం