IMD Weather Updates : తెలంగాణలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు! ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త, ఐఎండీ హెచ్చరికలు!
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివార ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా మరోసారి తెలంగాణకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇవాళ అతి భారీ వర్షాలు..!
ఇవాళ (సెప్టెంబర్ 8) ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(సెప్టెంబర్ 09) ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో సెప్టెంబర్ 11వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్:
శనివారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో మళ్లీ మున్నేరు వాగులో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు హెచ్చరికలను(రెడ్ అలర్ట్) జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించారు. దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు తరలించారు.
తాజా పరిస్థితులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐఎండీ సూచనల ప్రకారం… జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇండ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. అత్యవసరమైన పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1077ను సంప్రదించాలని సూచించారు.