Pawan Kalyan : రైతులకు తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు ఇవ్వాలి- పవన్ కల్యాణ్-amaravati news in telugu janasena chief pawan kalyan demands immediate relief to cyclone effect farmers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : రైతులకు తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు ఇవ్వాలి- పవన్ కల్యాణ్

Pawan Kalyan : రైతులకు తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు ఇవ్వాలి- పవన్ కల్యాణ్

Bandaru Satyaprasad HT Telugu
Dec 06, 2023 07:55 PM IST

Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వం రైతులకు పంటల బీమా విషయంలోనూ నిర్లక్ష్యం చేసిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ పూర్తి నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు ఇవ్వాలన్నారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : మిగ్‌ జామ్‌ తుపాను తీవ్రతతో రాష్ట్రం అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుపాను సహాయక శిబిరాల్లోని ఏర్పాట్లపై బాధితులు అసంతృప్తితో ఉన్నారని, ఆహారం, మందులు అందించడంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్న పవన్... లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోందన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విజయనగరం జిల్లాల్లో వరి సాగు చేసిన రైతులు కన్నీళ్లతో ఉన్నారన్నారు. చాలా చోట్ల కోతల దశకు చేరిన పంటలు నీట మునిగాయన్నారు. కోసిన పంట, పొలాల్లో ఉన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయన్నారు. వర్షాలతో అదనంగా ఎకరాకి రూ.10 వేలు ఖర్చు వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారని పవన్ అన్నారు. ప్రభుత్వం తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు అందించాలని కోరారు.

పంట బీమా విషయంలో నిర్లక్ష్యం

"రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అరటి, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. వీటితో పాటు పొగాకు, మినప, శెనగ, మిర్చి తదితర పంటలు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.7 వేల కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పంట నష్టాన్ని గణించడంలో వాస్తవికతను ప్రతిబింబించాలి. కరవు మండలాలను గుర్తించే విషయంలో తూతూ మంత్రంగా లెక్కలు వేశారు. మిగ్‌ జామ్‌ నష్టం విషయంలోనూ అలాగే తప్పుడు లెక్కలు వేస్తే రైతులకు అన్యాయం చేయడమే అవుతుంది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతులను ఆదుకొనే విధంగా చర్యలు ఉండాలి. ఈ ప్రభుత్వం రైతులకు పంటల బీమా విషయంలోనూ నిర్లక్ష్యం వహించింది. దీనికి బాధ్యత వహిస్తూ పూర్తి నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలి"- పవన్ కల్యాణ్

బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలి-నాదెండ్ల మనోహర్

తుపాను నష్టం అంచనాలకు అందకుండా ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి అడుగులో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు. నిర్లక్ష్యాన్ని వదిలి ప్రభుత్వం కచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా సీఎం బటన్‌ నొక్కాలని డిమాండ్‌ చేశారు. తక్షణ సాయం కింద ప్రతి రైతుకీ రూ. 20 వేల ఆర్థిక సాయం అందించాలన్నారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్‌ మండలాల్లో మిగ్‌ జాం తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తో కలసి పరిశీలించారు. అయితానగరం, చక్రాయపాలెం, బుర్రిపాలెం, చదలవాడ, చెముడుపాడు తదితర గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. నీటిలో ఉన్న ఓదెలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చోట అన్నదాతను పలుకరిస్తూ నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో నిలచిన నీటిని ఇంజన్లతో తోడుకుంటున్న రైతులతో మాట్లాడారు. ప్రతి చోటా పొలాల మధ్యకు వెళ్లి మురుగు కాల్వ వ్యవస్థను పరిశీలించారు.

రూ.2 కోట్లు దేనికి సరిపోతుంది

అనంతరం నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ... రైతు కష్టాల్లో ఉన్నాడని, ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసం చేయడం కాదు... రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలన్నారు. తూతూ మంత్రంగా రూ. 2 కోట్లు ఇచ్చామంటే అది దేనికి సరిపోతుందని ప్రశ్నించారు. బాపట్ల, గుంటూరు జిల్లాల్లో సుమారు రూ. 1800 కోట్ల మేర పంట నష్టం వాటిల్లిందని, ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే అన్నారు. కాలువలు మరమ్మతులు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్న ఆయన.. నాలుగేళ్లుగా కాలువలు మరమ్మతులు చేపట్టకుండా మాయమాటలు చెప్పి గడిపేశారని ఆరోపించారు. ఏ మండలానికి వెళ్లినా రైతులు కాలువల మరమ్మతులు చేయలేదని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతుల ఆవేదన, బాధ చూసిన ప్రభుత్వంలో ఉన్నవారు చలించాలని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రతి గింజా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ప్రతి గింజా కొనుగోలు చేసే వరకు జనసేన - టీడీపీ కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.

IPL_Entry_Point