Chandrababu Bail : ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, హైకోర్టు కీలక నిర్ణయం!
Chandrababu Bail : ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఇటీవలే వాదనలు ముగిశాయి.
Chandrababu Bail : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇటీవలే హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే ఈ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. సీఐడీ దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదనల్లో టీడీపీ నేత లోకేశ్ పై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా హైకోర్టుకు అందించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర రోడ్ల అలైన్ మెంట్ మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా కేసు నమోదు చేసింది. దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఈ ఏడాది సెప్టెంబరులో పిటిషన్ దాఖలు వేశారు. ఈ పిటిషన్ పై విచారణ అనంతరం హైకోర్టులో తీర్పు రిజ్వర్ చేసింది.
లోకేశ్ అరెస్టుకు అనుమతించాలని పిటిషన్
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ కు సీఐడీ 41ఏ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన యువగళం-నవశకం సభలో నారా లోకేశ్ ను 41ఏ నిబంధనులు ఉల్లంఘించారని సీఐడీ ఆరోపించింది. దీంతో లోకేశ్ ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే లోకేశ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది సీఐడీ.
చంద్రబాబు కేసుకు సంబంధించి రెడ్‌బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను లోకేశ్ బెదిరించే విధంగా మాట్లాడారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామని చేసిన ప్రకటనలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. రెడ్‌బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనను సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు కోరింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే లోకేశ్ పేరును చేర్చింది సీఐడీ. హైకోర్టు ఆదేశాలతో 41ఏ నోటీసులను కూడా జారీ చేసింది. అయితే ఇందులో పేర్కొన్న నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారని పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గతంలో లోకేశ్ ను సీఐడీ విచారణ కూడా చేసింది. హైకోర్టులో సైతం లోకేశ్ వ్యాఖ్యలకు సంబంధించి లిఖిత పూర్వకంగా అందజేసింది. సీఐడీ లిఖిత పూర్వక వాదనలపై టీడీపీ తరఫున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.