Nara Lokesh Help : మంత్రి నారా లోకేశ్ చొరవ, స్వదేశానికి చేరుకున్న కువైట్ బాధితుడు శివ
Nara Lokesh Help : కువైట్ లో చిక్కుకున్న ఏపీకి చెందిన శివ క్షేమంగా ఏపీకి చేరుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కువైట్ వెళ్లిన శివ..పని హింసలు తట్టుకోలేక సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఈ వీడియో చూసిన మంత్రి నారా లోకేశ్ శివను స్వదేశానికి రప్పించేందుకు సాయం చేశారు.
Nara Lokesh Help : మంత్రి నారా లోకేశ్ మాట నిలబెట్టుకున్నారు. కువైట్ లో చిక్కుకున్న మదనపల్లి చింతపర్తి వాసి శివ ఏపీ ప్రభుత్వం, నారా లోకేశ్ సాయంతో ఏపీకి చేరుకున్నాడు. శివ నెల రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఏజెంట్ సహాయంతో కువైట్ వెళ్లాడు. అయితే వెళ్లే ముందు ఏజెంట్ చెప్పిన పని ఒకటి అక్కడ చేయించిన పనిమరొకటని, తనను హింసిస్తున్నారని శివ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. తనను రక్షించాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని వేడుకున్నాడు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కువైట్ లోని భారత ఎంబసీతో సంప్రదించి శివను స్వదేశానికి రప్పించారు నారా లోకేశ్. ఏపీకి చేరుకున్న శివను చూసిన ఆయన కుమార్తె, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. నారా లోకేశ్, కువైట్ టీడీపీ చొరవతో కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్నానని శివ తెలిపారు. మంత్రి నారా లోకేశ్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు శివ, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శివ స్వదేశానికి చేరుకున్న వీడియోను మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
"ఆర్థిక పరిస్థితులు బాగోలేక నెల రోజుల క్రితం కువైట్ కు వెళ్లాను. గొర్రెలు కాసే పని అని ఏజెంట్ చెప్పాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత గొర్రెలు, కుక్కలు, ఒంటెలు, పక్షులు, ఇలా చాలా జంతువులను చూడాల్సి వచ్చింది. ఎక్కడో ఏడారిలో పడేశారు. నీళ్లు కావాలంటే రెండు కిలోమీటర్లు వెళ్లాలి. ఎండలు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను. ఇండియా వచ్చేస్తా, మరొకరిని చూసుకోవాలని ఏజెంట్ ను ప్రాధేయపడ్డాను. కానీ ఏజెంట్ స్పందించలేదు. గొర్రెలు, కుక్కలు చనిపోతే నన్ను హింసించేవారు. దీంతో ఓ వీడియో తీసి సోషల్ మీడియో పెట్టాను. ఈ వీడియో నారా లోకేశ్ దృష్టికి చేరి నన్ను రక్షించారు. నాకు సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు" - శివ, కువైట్ బాధితుడు
అసలేం జరిగింది?
అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి గ్రామానికి చెందిన అయివేత శివ(36)కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బతుకుదెరువు కోసం గత నెలలో రాయచోటికి చెందిన ఏజెంట్‌కు లక్ష చెల్లించి కువైట్ వెళ్లాడు. అక్కడ పరిస్థితులు తిరిగి వచ్చేయాలని భావించినా మరో లక్ష చెల్లిస్తే ఏర్పాటు చేస్తానని చెప్పడంతో శివ విలవిల్లాడిపోయాడు. కువైట్- ఇరాక్ సరిహద్దులో ఉన్న ఎడారిలో గొర్రెలు, ఒంటెలు, బాతులు మేపుతూ వాటికి కాపలా కాసే కుక్కలకు నీళ్లు పోసే పనిలో ఏజెంట్ కుదిర్చాడు. ఎడారిలో మొక్కలకు నీళ్లు పోయాల్సిన పరిస్థితి, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్ని వీడియోలో మిత్రులు, బంధువులకు పంపాడు. అతని దీన పరిస్థితి తెలియడంతో నారా లోకేశ్ భారత విదేశాంగ శాఖను సంప్రదించారు.
కువైట్ టీడీపీ విభాగానికి సమాచారం ఇవ్వడంతో పార్టీ అభిమానులు భాషా, జాబీర్‌లు శివ అచూకీ కోసం ప్రయత్నించారు. స్థానిక ఏజెంట్ల సాయంతో ఇరాక్ సరిహద్దుల్లో ఉన్నట్టు గుర్తించారు. సోమవారం శివ అచూకీ గుర్తించి భారత రాయబార కార్యాలయానికి తీసుకొచ్చి అప్పగించారు. అప్పటికే భారత విదేశాంగ శాఖ నుంచి సమాచారం అందడంతో రాయబార కార్యాలయ ఆదేశాలతో శివను పనిలో పెట్టుకున్న యజమాని అతని పాస్‌పోర్ట్ ఎంబసీలో అప్పగించాడు. ఇవాళ శివ భారత్ కు తిరిగి వచ్చాడు.
సంబంధిత కథనం