Inner Ring Road Case : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లోకేశ్
Inner Ring Road Case : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పుపై గతేడాది నమోదు చేసిన కేసులో నారా లోకేశ్ ను ఏ14గా సీఐడీ పేర్కొంది.
Inner Ring Road Case : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్ పేరును చేర్చింది సీఐడీ. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు లోకేశ్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పుపై గతేడాది నమోదు చేసిన కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పేరును తాజాగా సీఐడీ చేర్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ నెల 29 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుండడంతో... కావాలనే లోకేశ్ ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో మాజీమంత్రి నారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని సీఐడీ ఆరోపిస్తోంది. సింగపూర్ కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతలు అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని అభియోగించింది. ఇన్నర్ రింగ్ అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ప్రముఖులు, ముఖ్యమైన వ్యక్తుల భూముల విలువను పెంచుకునేందుకు అలైన్‌మెంట్ మార్పులు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ భూములకు దగ్గరగా రింగ్ రోడ్డు వెళ్లేలా ఇన్నర్ రింగ్ రోడ్డు దక్షిణం వైపుకు జరిపారని, విజయవాడలో మాజీ మంత్రి నారాయణ భూముల విలువ పెరిగేలా మార్పులు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది.
ఎల్లుండి నుంచి పాదయాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత దిల్లీలోనే మకాం వేసిన లోకేశ్... యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. రెండు వారాలుగా దిల్లీలోనే లోకేశ్ మకాం వేయడంపై అధికార పార్టీ విమర్శలు చేస్తుంది. అరెస్టు భయంతో లోకేశ్ దిల్లీలో దాక్కుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని లోకేశ్ నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీ రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే తిరిగి మొదలుకానుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో రాజోలు నియోజకవర్గం పొదలాడలో యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు లోకేశ్.