CM Chandrababu : కాలనీలు, ఇళ్లలో చేరిన వరద నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు-amaravati cm chandrababu naidu directs officials remove flood water from colonies houses ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : కాలనీలు, ఇళ్లలో చేరిన వరద నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu : కాలనీలు, ఇళ్లలో చేరిన వరద నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 01, 2024 02:38 PM IST

CM Chandrababu : వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కాలనీలు, ఇళ్లలోంచి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించి సాయం అందించాలని సీఎం సూచించారు.

కాలనీలు, ఇళ్లలో చేరిన వరద నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
కాలనీలు, ఇళ్లలో చేరిన వరద నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారులపై నీటికి బయటకు పంపడమే కాదు....కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని, ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం గత రెండు రోజుల్లో పడిందన్నారు.

వరద ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించండి

"ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయి. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పనిచేయాలి. వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించండి. దానికి అనుగుణంగా రెస్క్యూ ప్లాన్ చేయండి. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. నివాస ప్రాంతాల మధ్య నుంచి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలి. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలి"- సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నూజివీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి కొలుసు పార్థసారధి సీఎంకు వివరించారు. ఇబ్బందుల్లో ఉన్న పలుప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎంకు వివరించారు. వరదలపై వ్యవసాయ శాఖ తరపున తీసుకుంటున్న చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలని, రైతులకు, బాధిత కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

ప్రకాశం బ్యారేజీ నుంచి సాయంత్రానికి నీటి ప్రవాహం 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అధికారుల అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన బాపట్ల జిల్లాలో 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలకు పంపాలని సీఎం ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద వరద కారణంగా రైలు నిలిచిపోయింది. ప్రయాణికులకు సాయం అందించినట్లు జిల్లా కలెక్టర్, డీజీపీ.. సీఎం చంద్రబాబుకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం అంచనా వేసి పంపాలన్నారు. మనం చేసే పనితో ప్రజల్లో సంతృప్తి కలగాలి, మంచి చేసి సాయం అందిస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని సీఎం అన్నారు.

డ్రోన్ల ద్వారా పంట నష్టం అంచనా

"పంట నష్టాన్ని అంచనా వేయాలి. ఎక్కడా పెండింగ్ లో పెట్టకూడదు. డ్రోన్ల ద్వారా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలి. ఒక్క ఎకరా కూడా మిస్ అవ్వొద్దు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదు. దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని కూడా మదింపు చేయాలి. పనితీరు, వ్యవస్థలో లోపాటు ఉంటే సరైన సమాచారం ప్రజలకు అందదు..మనమంతా ప్రజల కోసమే పని చేస్తున్నాం...వారికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు. ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం కలుగుతుంది...ఆ దిశగానే మనం పని చేయాలని అందరూ గుర్తు పెట్టుకోవాలి. బాధ్యతలు అప్పగించిన అధికారులు విధులు సరిగా నిర్వర్తించకుండా తప్పించుకుంటే చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలి. మంత్రులు కూడా క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలి. ప్రజా ప్రతినిధులుగా ఉన్న మనం వారికి అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి."- సీఎం చంద్రబాబు

సంబంధిత కథనం