CBN Bail Petition : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా - ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగింపు
Chandrababu bail petition Updates : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…..రేపటికి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ గడువును పొడిగించింది కోర్టు.
Chandrababu Bail Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించగా… ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వినిపించారు. బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం….. విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇక కస్టడీ అవసరం లేదు - చంద్రబాబు తరపు న్యాయవాది
ఏసీబీ కోర్టులో రెండవరోజు చంద్రబాబు తరుపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు కు సంబంధం లేదని చెప్పారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. “డిజైన్ టెక్ సంస్థ తో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సిఎం హోదాలో స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు నిధులు మాత్రమే మంజూరు చేశారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కాం ఎక్కడుంది, చంద్రబాబు పాత్ర ఏముంది. ఇది పూర్తి గా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. ఇప్పటికే కస్టడీ లో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదు... అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారు. ఈ అంశాలను పరిశీలన చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నాం” అని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ వాదనలు వినిపించారు.
బెయిల్ ఇవ్వొద్దు - అదనపు ఏజీ పొన్నవోలు
ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు పాత్రకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లను సీఐడీ తరపున కోర్టుకు సమర్పించారు. డొల్ల కంపెనీల పేరుతో నిధులు కొటేశారని… హవాలా రూపంలో నిధులను కొట్టేశారని తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, మరింత విచారించేందుకు వీలుగా సీఐడీ కస్టడీకి అప్పగించాలని ఆయన కోర్టును కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
రిమాండ్ పొడిగింపు…
మరోవైపు చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. రెండో దఫా విధించిన రిమాండ్ గడువు ఇవాళ్టితో ముసిగిన నేపథ్యంలో… మరోసారి పొడిగించింది. సీఐడీ దాఖలు చేసిన మెమో మేరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.