Krishna District Crime : వినాయ‌క చ‌వితి వేళ దారుణం.. అడ‌గ‌కుండా మామిడాకులు కోశాడ‌ని క‌త్తితో దాడి!-a man was attacked with a knife during vinayaka chavithi in yanamalakuduru in krishna district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Krishna District Crime : వినాయ‌క చ‌వితి వేళ దారుణం.. అడ‌గ‌కుండా మామిడాకులు కోశాడ‌ని క‌త్తితో దాడి!

Krishna District Crime : వినాయ‌క చ‌వితి వేళ దారుణం.. అడ‌గ‌కుండా మామిడాకులు కోశాడ‌ని క‌త్తితో దాడి!

HT Telugu Desk HT Telugu
Sep 08, 2024 09:26 AM IST

Krishna District Crime : కృష్ణా జిల్లాలో వినాయ‌క చ‌వితి పండగ వేళ దారుణ ఘటన జరిగింది. అడ‌గ‌కుండా మామిడాకులు కోశాడ‌ని.. ఏకంగా ఓ వ్యక్తి క‌త్తితో దాడి చేశాడు. దీంతో పండ‌గ పూట న‌డిరోడ్డుపై ర‌క్త‌పు మరకలు కనిపించాయి. దాడి చేసిన వ్య‌క్తిపై కేసు న‌మోదు చేశారు.

కత్తి దాడిలో గాయపడ్డ అర్జునరావు
కత్తి దాడిలో గాయపడ్డ అర్జునరావు

కృష్ణా జిల్లా య‌న‌మ‌ల‌కుదురులో శ‌నివారం దారుణం జరిగింది. మామిడాల‌కు విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన గొడ‌వ.. చివ‌రికి క‌త్తిపోట్ల‌కు దారి తీసింది. శనివారం వినాయ‌క చ‌వితి రోజు కావడంతో.. అలంకరించుకోడానికి మామిడాకుల కోసం అర్జున‌రావు అనే వ్య‌క్తి బంధువ‌ల ఇంటికి వెళ్లాడు. అక్క‌డ అడ‌గ‌కుండా మామిడాకులు కోశాడు.

అయితే.. అడగకుండా ఎందుకు కోస్తున్నావంటూ అర్జున‌రావుతో ఇంటి యజమాని నాంచార‌య్య గొడవకు దిగాడు. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌మాట పెరిగి వాగ్వాదం జ‌రిగింది. స్థానికులు చెప్పిన‌ప్ప‌టికీ నాంచార‌య్య విన‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం పెరిగి అర్జున‌రావుపై ఇంటి జ‌య‌మాని నాంచార‌య్య క‌త్తితో దాడి చేశాడు. అర్జున‌రావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. న‌డిరోడ్డుపైనే ఈ వాగ్వాదం జ‌రగడంతో.. వీధిలో ర‌క్తం చిమ్మింది.

ర‌క్త‌పు మ‌డుగుల్లో ఉన్న అర్జున‌రావును వెంట‌నే ప‌డ‌మ‌ట‌లోని ఆసుప‌త్రి త‌ర‌లించారు. క‌త్తితో దాడి చేసిన నాంచార‌య్య‌పై బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ప‌ల్నాడు ఇద్ద‌రు మృతి..

పల్నాడు జిల్లాలో వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మండ‌పాల్లో విద్యుత్ షాక్‌తో శ‌నివారం ఇద్ద‌రు మృతి చెందారు. ప‌ల్నాడు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం శావ‌ల్యాపురం మండలం పొట్లూరు బీసీ కాల‌నీలో ఏర్పాటు చేసిన వినాయ‌క మండ‌పంలో.. విద్యుత్ దీపాలు అలంక‌రిస్తుండ‌గా స్థానిక ఎస్సీ కాల‌నీకి చెందిన పోపూరి దేవ స‌హాయం విద్యుదాఘాతానికి గుర‌య్యాడు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన స్థానికులు విడుకొండలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మార్గ‌మ‌ధ్య‌లోనే ఆయ‌న మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలోనూ విషాదం జరిగింది. వినాయక మండపంలో విగ్రహ ప్రతిష్ఠించడానికి నిర్వహించిన ఏర్పాట్లలో క‌రెంట్ షాక్‌కు గురై ఈర్ల లక్ష్మ‌య్య మృతిచెందారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner