Vinayaka chavithi 2024: వినాయ‌క చ‌వితి పండుగ వెనుక దాగి ఉన్న అంత‌రార్థం ఏమిటి?-what is the hidden meaning behind vinayaka chavithi festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vinayaka Chavithi 2024: వినాయ‌క చ‌వితి పండుగ వెనుక దాగి ఉన్న అంత‌రార్థం ఏమిటి?

Vinayaka chavithi 2024: వినాయ‌క చ‌వితి పండుగ వెనుక దాగి ఉన్న అంత‌రార్థం ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Sep 06, 2024 06:00 PM IST

Vinayaka chavithi 2024: వినాయక చవితి పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఎందుకు జరుపుకుంటారు. గణపతి విశిష్టత గురించి అధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు

వినాయక చవితి పండుగ అంతరార్థం
వినాయక చవితి పండుగ అంతరార్థం (pixabay)

Vinayaka chavithi 2024: వినాయకుడు గణనాథుడైనా, విఘ్ననివారకుడైనా ఆయనే! అందుకే 'ఓం గం గణపతయే నమః’ అంటాం అని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు. 

ఆదిదంపతుల ప్రథమ పుత్రుడిగా, గణసేనావాహిని అధినేతగా ఆ స్వామిని కొలుస్తాం. 'ఆదౌ పూజ్యో గణాధిపః' అని నోరారా కీర్తిస్తాం. ఎంతటి కార్యసిద్ధి అయినా తన ధ్యానం, ఆరాధనతో ప్రాప్తిస్తుంది. పరమానంద స్వరూప పరమాత్మ. అత్యంత మహామహిమాన్విత. ఓంకారరూపుడు, ప్రణవస్వరూపుడు. అంతటి ముఖదర్శనమే మనందరికీ శుభ, జ్ఞాన, మోక్షప్రదం. నిఖిల ప్రాణినాథుడైన తనను పూజిస్తే వృద్ధి, సమృద్ధి అని చిల‌క‌మర్తి తెలిపారు.

మహాగణాధిపతిని ‘కొలుచు వారలకు కొంగు బంగారమ్ము' అని పెద్దలమాట. ఇక విఘ్నం అంటే 'అంత రాయం'. ఎటువంటి అవాంతరాలనైనా తొలగించి, అడ్డంకులన్నింటినీ నివారించి, భక్తకోటిని పరిరక్షించే స్వామి కనుకనే ప్రతీ ఒక్కరికీ అండదండ. ఆ విఘ్నేశ్వరుని గురించి గణేశ, ముద్గల, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాలతో పాటు మరెన్నో కావ్యాలు సోదాహరణంగా విపులీకరిస్తున్నాయి.

వినాయకుడి విశిష్టత 

గణాధ్యక్షా, విఘ్నరాజా, సుప్రదీపా, మహాబలా, మంగళస్వరా, ప్రథమా, ప్రమథా, విశ్వ నేత్రా, ఆశ్రితవత్సలా, భవాత్మజాయా, అగ్రగణ్యాయా, సర్వాయా, సర్వసిద్ధిప్రదాయా, గణాధీశాయా, అభీష్టవర దాయా అంటూ అర్చిస్తుంది భక్త ప్రపంచం. జగదాధారునిగా, అపరాజితునిగా, కాంతిమతిగా, ధృతిమతిగా శ్లాఘిస్తుంది. నిఖిలావనికీ ప్రేమపాత్రుడైన ఆయనను వేదాలు, ఉపనిషత్తులకు తోడు అనేకానేక ప్రబంధాలు, శతకాలు ఎంతగా స్తుతించాయో చెప్పనలవి కాదు. 'ఆదరమొప్ప మ్రొక్కిడుదు- నద్రి సుతా.. సమద మూషిక సాదికి సుప్రసాదికిన్' అంటూ మహాద్భుతవర్ణన సాగించింది సహజకవి మది. ఈ విధంగా పలుకు పలుకునా తేనెలందుకున్న వినాయక స్వామి అందరివాడు, సాటిలేని మేటి రేడు.

ఎవరు ఎప్పుడు ఏ పని ఆరంభించినా గణాధ్యక్ష అర్చనతోనే. 'నీ మూర్తికే మొదటి ప్రణామం' అంటారందరూ. 'నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనందధామమని' నివేదిస్తుంటారు. ఊరూ వాడా వీధివీధినా రోజుల తరబడి పండగ సందడి. ఆసనం మీద ప్రతిమను ఉంచి, పాలవెల్లికి రూపుదిద్ది, పత్రితో సుందరంగా అలంకరించి, నలువైపులా పండ్లు అమర్చి, పిండివంటలెన్నింటినో సిద్ధపరచి, సమధిక ఉత్సాహంతో పరిపూర్ణ భక్తిప్రపత్తులతో పూజ నిర్వర్తిస్తారు. 

సకుటుంబంగా, క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సాధకంగా ఆరాధనలు జరుపుతారు. ధర్మ-అర్థ-కామ-మోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధికి సంబంధించి 'సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం' అంటూ పూజాదికాలు కొనసాగిస్తారు. 'ఏకదంతాయ, శూర్పకర్ణాయ, ఆఖువాహనాయ నమః' అని చేతులు రెండింటినీ జోడిస్తారు. సమర్చనలో వినియోగించే మాచీ, బృహతీ, బిల్వ, దూర్వాయుగ్మ, దత్తూర, బదరీ, తులసీ, చూత, కరవీరాది పత్రి సముదాయం ఉమ్మడిగా, విడిగానూ ఆరోగ్యప్రదాయకాలు.

వినాయక చవితి/ చతుర్థి మహోత్సవ శుభారంభం, నిమజ్జన సందర్భం- రెండూ ఎంతో వైభవోపేతంగా ఏర్పాటవుతాయి. చతుర్థి తిథిని అనుసరించే పర్వదిన నిమజ్జన తేదీ నిర్ణయమవుతుంది. ప్రత్యేకించి యువజన బృందాలతో నిర్వహణ అంగరంగ వైభవాన్ని తలపిస్తుంది. విలక్షణరీతిన మట్టితో చేసిన గణనాథుని ఆరాధనం దివ్యసందేశాన్ని అందచేస్తోంది. ఆ విధమైన విగ్రహరూప నిర్మాణం పంచమహాభూతాల సమ్మిళితం. 

నేల, నింగి, అగ్ని, జల, వాయుతత్త్వాలకు ఒక్కో అధిష్ఠాన దేవత రూపాలు, విధానాలు అసంఖ్యాకంగా ఉన్నా ఒకే పరమాత్మ అనేది మట్టిరూపుతోనే ప్రస్ఫుటమవుతుంది. అసలు 'గణపతి' అనగానే మది మదినా నవోత్తేజ పరికల్పన. ఆబాలగోపాలానికీ మహదానంద సదానుభవం. వ్యాపిత తత్త్వం భూమికే ఉంది. అదే ప్రకృతి సుస్వరూప గుణసంపన్నం. మృత్తిక పరబ్రహ్మ సమన్వితం. అందువల్లనే వినాయకుని మట్టితో చేసి అర్చించడం, సర్వ సకల సమస్త జీవసమత్వానికీ ఏకైక ప్రతీకగా పూజించడం అందుకే.

ఎలా పూజించాలి?

స్వామి ఎదురుగా కుదురుగా కూర్చుని ప్రార్థించాలి. మనసునంతటినీ సంపూర్తిగా కేంద్రీకరించాలి అందరూ. 'గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండీ, అతడే ఓంకృతి నిజమండీ' అని అంటారు. అట్లే 'ఏకదంతా గణనాథా శివగౌరి తనయా శరణు గణేశా' అని కీర్తిస్తారు. 'ఓ భక్త మందారా! ఓ సుందరాకారా! ఓ భాగ్యగంభీరా! ఓ దేవ చూడామణీ! లోకరక్షామణీ!' అని ధ్వనిస్తుంది భక్తలోక మనోమందిరం. 'కుడుములర్పించు పిల్లభక్తులకు నెల్ల ఇడుము లందించి కలుములందించు చేయి' అని స్తోత్రావళి సమర్పించింది. ఇవన్నీ స్వామి కరుణాకటాక్షవీక్షణ సాధకాలే.

గణేశ చతుర్థిలో పర్వదినమహోత్సవ ఉత్సాహంతోపాటు సంప్రదాయ, సాంస్కృతిక, ఐక్యత అంశాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఇళ్లు, వీధులు, ఊళ్లు ఊళ్లన్నీ భక్తితన్మయత్వంలో మమేకమై, ఆధ్యాత్మిక నిండుదనాన్ని ఎంతగానో సంతరించుకుంటాయి. రూపప్రతిష్ఠాపన, పద్యాలూ పాటలూ శ్లోకాలూ భజనలూ, ఆనందతన్మయ చైతన్య చిన్మయ వాతావరణంలో నృత్యగీతికనూ నవోల్లాసాన్ని సృజిస్తాయి. 

ఐక్యత చిహ్నం 

అన్ని అంతరాలకూ అతీతంగా ప్రజలందరూ పాల్గొనే కార్యక్రమాల పరంపరతో సమైక్యతాస్ఫూర్తి వెలుగులీనుతుంది. సామాజిక అనుబంధం పరివ్యాప్తమై, నిమజ్జనం వరకు కొనసాగి, అంతటా దీప్తిమంతత వెల్లివిరుస్తుంది. అష్టకంలో ఉన్నట్లు... 'ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్/ లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్. గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్/ పాశాంకుశధరం దేవం వందేహం' ఇలా మహోత్తుంగ భక్తజనతరంగం వినాయక స్వామిని అభిషేకిస్తుంది. తిరుపతి ప్రాంతంలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రాంగణం ఎంతెంతో శోభాయమానమవుతుంది. ఇక్కడ ఏర్పాటయ్యే వార్షిక బ్రహ్మోత్సవం నేత్రానందదాయకం. సత్య ప్రమాణాల దైవం ఆయన.

పూజించిన వినాయక విగ్రహాల నిమజ్జనం భారతదేశవ్యాప్తంగా ఘనాతిఘనంగా జరుగుతుంది. ముందుగా సభక్తికంగా అర్చించి, పూలూ పండ్లూ, మోదక లడ్డూలూ, నూతన వస్త్రవిశేషాలను స్వామి ముందు ఉంచుతారు. హారతి అనంతరం ప్రసాద నైవేద్యాన్ని అందరికీ పంచుతారు. నమస్సుమాలు సమర్పించి ఉత్సవవేళ ఏవైనా పొరపాట్లు తెలియక దొర్లి ఉంటే మన్నించాలని వేడుకుంటారు. 

మండపాల నుంచి విగ్రహాలను కదిలించే ముందు మంత్రపఠనాలతో పాటు 'జై బోలో గణేశ మహరాజ్కీ', 'గణపతి బప్పా మోరియా' నినాద ధ్వనులు అన్నింటా, అంతటా మారుమోగుతాయి. బప్పా మోరియా అనేది అనంత ప్రేమభక్తి తత్త్వాలకు నిదర్శనం. తండ్రీ... దైవమా.... అని నిండు మనసుతో ఆరాధించే పదబంధం. జలనిమజ్జనమనేది అభిషేకసూచకం. ఇందులో ధార్మికతకు తోడు తాత్త్విక, భౌతిక విశిష్టతలు ఇమిడి ఉండటం మహత్తర అంశం. 'ఆకాశస్యాధిపో విష్ణుః, అగ్నిశ్చైవ మహేశ్వరః/ వాయోసూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః’ అని పురాణోక్తి.

'నేలతో కూడిన ప్రకృతిని మనం ఎంత పరిరక్షించు కుంటే, అంత ఉత్తమ ఫలితం మనకు ప్రాప్తిస్తుంది' అన్నది వినాయక చవితి ఘంటాపథంగా చాటి చెప్తుంది. పత్రి ఔషధ గుణాలు, పాలవెల్లి అలంకరణ విలక్షణతలు, ఉండ్రాళ్లు కుడుములవంటి నైవేద్యాల సమర్పణలు- భక్తులు ఎవరికి వారికే అనుభవైక వేద్యాలు. పండగ అంటే వినాయకచవితే! ఇంతకు మించిన సందడి మరేదీ ఉండదంతే!

Whats_app_banner