Konaseema: అమ్మో.. ఇంత పెద్ద చేపనా.. జేసీబీతో ఒడ్డుకు తెచ్చిన మ‌త్స్య‌కారులు-a huge teak fish caught in the fishermen net in konaseema ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Konaseema: అమ్మో.. ఇంత పెద్ద చేపనా.. జేసీబీతో ఒడ్డుకు తెచ్చిన మ‌త్స్య‌కారులు

Konaseema: అమ్మో.. ఇంత పెద్ద చేపనా.. జేసీబీతో ఒడ్డుకు తెచ్చిన మ‌త్స్య‌కారులు

HT Telugu Desk HT Telugu
Aug 19, 2024 05:04 PM IST

Konaseema: కోనసీమలో మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. ఈ భారీ చేపను జేసీబీతో ఒడ్డుకు తెచ్చారు మ‌త్స్య‌కారులు. ఆ భారీ టేకు చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. ఈ చేప చిక్కిన మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భారీ టేకు చేప
భారీ టేకు చేప

కోనసీమ జిల్లా అంతర్వేదిలో మత్స్యకారుల వలకు సుమారు 1,800 కిలోల బరువున్న టేకు చేప చిక్కింది. అంతర్వేది సముద్ర తీరంలోకి చేపల వేటకు వెళ్లగా.. ఇది దొరికిందని.. అతి కష్టం మీద అంత‌ర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చామని మత్స్యకారులు తెలిపారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వేముల‌దీవికి చెందిన బ‌లంగం వెంక‌టేశ్వ‌ర్లు బోటుపై.. కాకినాడ మ‌త్స్య‌కారులు అంత‌ర్వేది సముద్ర‌తీరంలోకి చేప‌ల వేట‌కు వెళ్లారు. వారికి భారీ టేకు చేప చిక్కింది. దీని బ‌రువు సుమారు 1,800 కిలోలు ఉంటుందని అంచ‌నా. ఈ చేప వలకు చిక్కడంతో.. పంట పండింద‌ని మ‌త్స్య‌కారులు సంబ‌ర‌ప‌డిపోయారు.

ఈ భారీ చేపను బ‌డ్డుకు చేర్చ‌డ‌ం స‌వాల్‌గా మారింది. చేప‌ను ఒడ్డుకు చేర్చేందుకు సుమారు 30 మంది మ‌త్స్య‌కారులు తాళ్లు క‌ట్టి లాగారు. కానీ లాభం లేకుండా పోయింది. మ‌త్స్య‌కారులు ఎంత శ్ర‌మించినా ఆ భారీ బ‌హుబ‌లి చేప క‌ద‌ల‌లేదు. ఏం చేయాలో తెలియ చివ‌రికి జేసీబీని తీసుకొచ్చారు. జేసీబీ స‌హ‌యంతో ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి జేసీబీ సాయంతో వ్యాన్ లోకి ఎక్కించారు. అంత‌ర్వేది ఫిషింగ్ హార్బ‌ర్‌లో కొనుగోలుదారుల‌కు, మ‌త్స్య‌కారుల మ‌ధ్య బేరం కుద‌ర‌లేదు. ఈ చేప అంత‌ర్వేదిలో త‌క్కువ రేటు వ‌స్తుంద‌ని.. కుంబాభిషేకం హార్బ‌ర్‌కు తీసుకెళ్తామ‌ని చెప్పారు. దీని ధ‌ర త‌క్కువ‌లో త‌క్కువ మూడు ల‌క్ష‌లు పలుకుతుందని మత్స్యకారులు చెప్పారు.

ఈ టేకు చేప‌లు చాలా అరుదుగా వ‌ల‌కు చిక్కుతాయ‌ని మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. టేకు చేప‌పై ఉన్న శంకులను (పువ్వు) ఆఫ్రికా దేశాల‌కు ఎగుమ‌తి చేస్తార‌ని.. వాటితో అలంకర‌ణ వ‌స్తువులు త‌యారు చేస్తార‌ని మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. టేకు చేప పులుసు చాలా రుచిగా ఉంటుందన్నారు. ఇది సొర చేప జాతికి చెందిన‌ద‌ని రాజోలు మ‌త్స్య‌శాఖ ఏడీ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ చెప్పారు. శంకు చాలా విలువైన‌ద‌ని వివరించారు. ఈ భారీ బ‌హుబలి చేప‌ను చూడ‌టానికి స్థానికులు ఎగ‌బ‌డ్డారు.

( రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )