Scrap Exports Fraud: కార్లు, జేసీబీలు అద్దెకు తీసుకుని స్క్రాప్ పేరిట విదేశాలకు ఎగుమతి, కోట్లలో కుచ్చుటోపీ-cars are rented and exported abroad in the name of scrap ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scrap Exports Fraud: కార్లు, జేసీబీలు అద్దెకు తీసుకుని స్క్రాప్ పేరిట విదేశాలకు ఎగుమతి, కోట్లలో కుచ్చుటోపీ

Scrap Exports Fraud: కార్లు, జేసీబీలు అద్దెకు తీసుకుని స్క్రాప్ పేరిట విదేశాలకు ఎగుమతి, కోట్లలో కుచ్చుటోపీ

HT Telugu Desk HT Telugu
Jun 17, 2024 07:55 AM IST

Scrap Exports Fraud: ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని స్క్రాప్ పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వాహనాలను స్క్రాప్‌గా మారుస్తున్న ముఠా అరెస్ట్
వాహనాలను స్క్రాప్‌గా మారుస్తున్న ముఠా అరెస్ట్

Scrap Exports Fraud: దశరథ్ గ్యాంగ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ముఠా ఇది. ఆర్థిక ఇబ్బందులతో కార్లు, జేసీబీలు, ఇతర భారీ వాహనాలు అమ్మకానికి పెడుతున్న వ్యక్తులను టార్గెట్ చేయడం, ఆ తరువాత వారి నుంచి వాహనం కొనుగోలు చేస్తున్నట్టుగా కొంత మొత్తం అప్పగించి వెహికిల్ తీసుకెళ్లడం, గుట్టు చప్పుడు కాకుండా బండిని స్క్రాప్ గా మార్చి విదేశాలకు అమ్మేయడం.. ఇదీ దశరథ్ ముఠా చేస్తున్న దందా.

తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలతో పాటు కర్నాటకలో కూడా జనాలను మోసం చేసి రూ.కోట్ల విలువైన వాహనాలను స్క్రాప్ గా మార్చి విదేశాలకు తరలించగా, చివరకు వరంగల్ పోలీసులు వారిని పట్టుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం తుర్కలకుంట గ్రామానికి చెందిన వరికుప్పల దశరథ్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలోని తుర్కయాంజిల్ లో ఉంటున్నాడు. అతనికి పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కు చెందిన జేసీబీ ఆపరేటర్ దుర్గం సందాన్, రంగారెడ్డి జిల్లా జగద్గీరిగుట్టకు చెందిన డ్రైవర్ కౌశెట్టి రాకేశ్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ సంతోష్ నగర్ కు చెందిన స్క్రాప్ బిజినెస్ వ్యాపారి మహమ్మద్ జాబీర్ తో పరిచయం ఏర్పడింది. వీరంతా వేర్వేరు పనులకు సంబంధించిన వ్యక్తులు కాగా, దశరథ్ అందరితో కలిసి సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక తయారు చేశాడు.

స్క్రాప్ గా మార్చి విదేశాలకు ఎక్స్ పోర్ట్

దశరథ్ ప్లాన్ లో భాగంగా ఆర్థిక ఇబ్బందులతో పెద్ద పెద్ద వాహనాలను అమ్మకానికి పెట్టిన యజమానులను టార్గెట్ చేసేవారు. ఖరీదైన కార్లు, జేసీబీలు, టిప్పర్లు, ఇతర వాహనాలు ఏమున్నా తాము కొంటామని జనాలకు తమ ఫోన్ నెంబర్ సర్క్యూలేట్ చేసేవారు.

తమ బిజినెస్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో దశరథ్ వాట్సాప్ గ్రూపులు కూడా మెయింటేన్ చేసేవాడు. ఆ తరువాత తమను సంప్రదించిన వారి టచ్ లోకి వెళ్లి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాహనాలను కొంటామని, ఆ తరువాత ఈఎంఐలు కూడా తామే క్లియర్ చేసుకుంటామని చెప్పేవారు. దీంతో వాహనం అమ్మేందుకు అవతలి వ్యక్తులు ఓకే చెప్పగా, వారికి కొంత అమౌంట్ ముట్టజెప్పి, మిగతా మొత్తం తొందర్లోనే చెల్లిస్తామని నమ్మించి వాహనంతో పాటు పేపర్లు కూడా తీసుకెళ్లేవారు.

తమ ప్లాన్ ప్రకారం వాహనాలను తీసకొస్తున్న దశరథ్ గ్యాంగ్ ఆ తరువాత వాటిని ఇక్కడే ఎక్కువ రేటుకు అమ్మేయడం లేదా స్క్రాప్ కింద మార్చి ముంబాయిలోని ముఠాల ద్వారా నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికా, కంబోడియా లాంటి దేశాలకు ఎక్స్ పోర్ట్ చేసేవారు. కొన్నేళ్ల నుంచి ఈ దందా సాగిస్తుండగా, ఇదివరకు హైదరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 16 కేసులలో వారిని జైలుకు పంపగా, బయటకు వచ్చిన తరువాత తీరు మార్చుకోకుండా అదే దందా సాగిస్తున్నారు.

రూ.కోట్ల విలువైన వాహనాలు గల్లంతు

వాహనాల దందా చేస్తున్న దశరథ్ ముఠా.. 2023 నుంచి మళ్లీ మోసాలు మొదలు పెట్టింది. తెలంగాణలోని వరంగల్ మట్వాడ, నల్గొండ జిల్లా చింతపల్లి, తిప్పర్తి, సైబరాబాద్ పరిధిలో ఆమనగల్, మోకిలా, మహబూబ్ నగర్ లోని జడ్చర్ల, నాగర్ కర్నూల్ లోని కల్వకుర్తి, రాచకొండలోని కీసర పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు రూ.4.5 కోట్ల విలువైన వాహనాలను నెదర్లాండ్, సౌతాఫ్రికా, కంబోడియా తదితర దేశాలకు ఎక్స్ పోర్ట్ చేశారు.

కాగా మోసపోయిన బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న వరంగల్ పోలీసులు దశరథ్ ముఠా గురించి ఆరా తీశారు. గతంలో హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన తీరును తెలుసుకున్నారు. అనంతరం దశరథ్ గ్యాంగ్ పై నిఘా పెట్టి వరంగల్ పెద్దమ్మగడ్డ హనుమాన్ జంక్షన్ సమీపంలో నలుగురిని పట్టుకున్నారు.

వారి జనాలను మోసం చేసి పట్టుకొచ్చిన దాదాపు రూ.70 లక్షల విలువైన ఒక ఇన్నోవా క్రిస్టా, నాలుగు స్విఫ్ట్ డిజైన్ కార్లను హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు. దశరథ్ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన మట్వాడ సీఐ గోపి, ఎస్సై కుమార్, క్రైమ్ టీం సిబ్బంది -రవీందర్, అలీ, విజయ్ కాంత్, హరికాంత్, రాజేందర్, శివ, సల్మాన్ తదితరులను సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ అభినందించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel