Anganwadi Strike: సంక్రాంతి వరకు అంగన్ వాడీల సమ్మె వాయిదా వేయాలని కోరిన మంత్రుల బృందం-a group of ministers asked to postpone the anganwadis strike till sankranti ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anganwadi Strike: సంక్రాంతి వరకు అంగన్ వాడీల సమ్మె వాయిదా వేయాలని కోరిన మంత్రుల బృందం

Anganwadi Strike: సంక్రాంతి వరకు అంగన్ వాడీల సమ్మె వాయిదా వేయాలని కోరిన మంత్రుల బృందం

Sarath chandra.B HT Telugu
Dec 27, 2023 06:20 AM IST

Anganwadi Strike: అంగన్వాడీల సమ్మెను సంక్రాంతి వరకూ వాయిదా వేయాలి మంత్రుల బృందం విజ్ణప్తి చేసింది. అంగన్వాడీల 11 డిమాండుల్లో 10 ఇప్పటికే అంగీకరించామని, గౌరవ వేతనం పెంపు అంశం సంక్రాంతి తర్వాత చర్చిద్దామని కోరారు.

అంగన్‌ వాడీ ప్రతినిధులతో బొత్స చర్చలు
అంగన్‌ వాడీ ప్రతినిధులతో బొత్స చర్చలు

Anganwadi Strike: రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని అయితే ఇందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘాల ప్రతినిధులకు విజ్ణప్తి చేశారు.

అంగన్వాడీల సమ్మెపై నేపధ్యంలో వారి డిమాండ్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమై చర్చించింది. ఈసందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డిలు అంగన్‌ వాడీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

జనవరి 5నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు,బాలింతలు,చిన్నారులకు టేక్ హోం రేషన్ సహా వివిధ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు.సంక్రాంతి అనంతరం మరలా కూర్చుని చర్చించుకుని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని విజ్ణప్తి చేశారు.

ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి 11 డిమాండులకు గాను 10 డిమాండులను పరిష్కరించడమే గాక 4అంశాలకు సంబంధించి అనగా పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు పెంపు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు, టిఏడిఏలు,అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని50 వేల రూ.లు నుండి లక్ష రూ.లకు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 25 వేల నుండి 40 వేల రూ.లకు పెంచడం వంటి వాటిపై జిఓలను కూడా జారీ చేశామన్నారు.

మిగతా అంశాలపై రెండు మూడు రోజుల్లో జిఓలను జారీ చేయడం జరుగుతుందని మంత్రుల బృందం స్పష్టం చేసింది.ఒకే ఒక్క డిమాండు అనగా గౌరవ వేతనం పెంపు అంశం మిగిలి ఉందని దీనిపై సంక్రాంతి తర్వాత మరలా సమావేశమై చర్చించి దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుందాని చెప్పింది. అంగన్వాడీల గ్రాట్యుటీ అంశానికి సంబంధించి కేంద్రానికి లేఖ వ్రాస్తామని స్పష్టం చేసింది. అంగన్వాడీల సమస్యల పరిస్కారం పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని కావున సమ్మెను సంక్రాంతి వరకూ వాయిదా వేయాలని మంత్రుల బృందం విజ్ఞప్తిచేసింది.

ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్లు,సహాయకుల సంఘాల తరుపున పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ వేతనం పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో విజ్ణప్తి చేశారు. ప్రస్తుత ధరల దృష్ట్యా చాలీచాలని వేతనంతో కుటుంబాలను పోషించు కోవడం కష్టంగా ఉందని గౌరవ వేతనం పెంపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.

సమ్మె కొనసాగిస్తాం…

ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించ కపోవడంతో సమ్మె ఉధృతం చేయనున్నట్లు అంగన్‌వాడీ సంఘాల నాయకులు ప్రకటించారు. సచివాలయంలో మంగళవారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘాల నేతలతో మంత్రుల బృందం చర్చలు విఫలమైనట్లు ప్రకటించారు.

తమ ప్రధాన డిమాండ్లయిన వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై పీటముడి వీడలేదని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి 3న కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని ప్రకటించారు.

Whats_app_banner