Budameru Flood: ప్రళయానికి పక్షం రోజులు... ఇంకా వరద ముంపులోనే విజయవాడ రూరల్ గ్రామాలు, రాకపోకలు నిలిచి దయనీయ పరిస్థితులు-a fortnight to the deluge still under the flood the rural villages of vijayawada transportation has stopped ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Budameru Flood: ప్రళయానికి పక్షం రోజులు... ఇంకా వరద ముంపులోనే విజయవాడ రూరల్ గ్రామాలు, రాకపోకలు నిలిచి దయనీయ పరిస్థితులు

Budameru Flood: ప్రళయానికి పక్షం రోజులు... ఇంకా వరద ముంపులోనే విజయవాడ రూరల్ గ్రామాలు, రాకపోకలు నిలిచి దయనీయ పరిస్థితులు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 15, 2024 01:33 PM IST

Budameru Flood: విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తి సరిగ్గా పక్షం రోజులైంది. వరద ముంపు నుంచి విజయవాడ నగరం కోలుకున్నా ఇంకా రూరల్ గ్రామాలు తేరుకోలేదు. రోడ్లు కూడా వరద ముంపులోనే ఉన్నాయి. వేలాదిమంది ప్రజలకు విజయవాడ నగరంలో రాకపోకలు తెగిపోయాయి.వరద ముంచెత్తాక ప్రభుత్వ సాయం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆదివారం ఉదయం కేటీ రోడ్డులో జక్కంపూడి వద్ద నిలిచిన వరద నీరు
ఆదివారం ఉదయం కేటీ రోడ్డులో జక్కంపూడి వద్ద నిలిచిన వరద నీరు

55Budameru Flood: విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి సరిగ్గా 15రోజులైంది. విజయవాడ నగరం ఇప్పుడిప్పుడో వరద ముంపు నుంచి కోలుకుంటున్నా శివారు గ్రామాల్లో ముంపు వీడటం లేదు. సహాయక చర్యలు కూడా అందకపోవడంతో ఈ గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 31-సెప్టెంబర్1 వ తేదీల్లో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ప్రవాహానికి గండి పడటంతో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది.

ఆగస్టు 31 శనివారం అర్థరాత్రి సమయంలో బుడమేరుకు గండి పడింది. వెంటనే దిగువకు వరద పోటెత్తింది. గంటల వ్యవధిలో పొలాలను ముంచెత్తుతూ వరద పోటెత్తింది. సరిగ్గా 1వ తేదీ ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు విజయవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలను వరద ముంచెత్తింది.

విజయవాడ నగర శివార్లలోని జక్కంపూడి గ్రామ పంచాయితీలో ఉన్న వైఎస్సార్‌ కాలనీకి మొదట వరద ప్రవాహం తాకింది. దానికి ఎగువున ఉన్న కవులూరు, పైడూరుపాడు గ్రామాలను ముంచెత్తుతూ వరద ప్రవాహం గంటల్లో దిగువకు చేరింది. వైఎస్సార్‌ కాలనీలో దాదాపు పదివేల కుటుంబాలకు జేఎన్‌‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా పునరావాసం కల్పించారు.

దానిని అనుకుని పెద్ద ఎత్తున 2010 నుంచి నివాసాలు ఏర్పాటయ్యాయి. విజయవాడ నగరంలో అద్దెల భారం పెరగడంతో రూరల్‌ మండలంలో సొంతిళ్లకు ప్రాధాన్యత పెరిగింది. అంబాపురం గ్రామ పంచాయితీ పరిధిలో వేల సంఖ్యలో కాలనీలు ఏర్పాటయ్యాయి. జక్కంపూడి, అంబాపురం, పాయకాపురం ప్రాంతాల్లో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు జరిగాయి.

15రోజుల తర్వాత కూడా  జక్కంపూడి టిడ్కో నివాస సముదాయాల దిగువన వరద ముంపులో నివాసాలు
15రోజుల తర్వాత కూడా జక్కంపూడి టిడ్కో నివాస సముదాయాల దిగువన వరద ముంపులో నివాసాలు

నిర్లక్ష్యమే నిలువునా ముంచింది...

బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌కు మూడు చోట్ల భారీగా గండి పడటం, ఆగస్టు‌ 31 అర్థరాత్రి సమయానికి రెగ్యులేటర్ గేట్లను ఎత్తేయడంతో వరద ప్రవాహం దిగువకు ముంచెత్తింది. బుడమేరుకు సమాంతరంగా ప్రవహించే పాముల కాలువ మీదుగా రెండో వైపు వరద నుంచి జనావాసాల్లో ముంచెత్తింది.

దీంతో విజయవాడ పాతబస్తీ చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ నుంచి అంబాపురం వరకు రూరల్‌ మండలంలోని గ్రామాలను ఆదివారం రాత్రి రెండు గంటల్లోపే వరద ముంచెత్తింది. విజయవాడ నగరంలోకి వరద ప్రవాహం రావడానికి ఏడెనిమిది గంటల సమయం పట్టింది. ఈ సమయంలో అధికార యంత్రాంగం నిర్లిప్లంగా, ‎ఉదాసీనంగా వ్యవహరించడంతో భారీ నష్టం వాటిల్లింది.

ఆగస్టు 30-31వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ నీరు కృష్ణానదిలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రవాహం వెనక్కి వచ్చి బుడమేరుకు రెండు వైపులా గండ్లు పడ్డాయి.

ముందస్తు సమాచారం లేక…

బుడమేరుకు గండ్లు పడటంతో విజయవాడ వైపు ఉన్న రూరల్‌ మండలంలోని జక్కంపూడి, వేమవరం, షాబాద్‌, కొత్తూరు-తాడేపల్లి గ్రామాలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విజయవాడ నగరంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేమవరం గ్రామ చెరువు వెంబడి నివాసాలు ఏర్పాటు చేసుకున్న యానాది కుటుంబాలు, కుమ్మరి కాలనీల్లోని వందల కుటుంబాలను వరద నీరు ముంచెత్తింది.

దీంతో వారంతా సమీపంలో ఉన్న సెయింట్‌ బెనడిక్ట్‌ స్కూల్లో ఆశ్రయం పొందారు. గ్రామంలోని టీడీపీ నాయకులు వందలాది కుటుంబాలకు 12రోజులపాటు ఆహారం అందించారు. ఓ దశలో గ్రామంలో నిల్వలు లేవని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా అధికార యంత్రాంగం ఎలాంటి సాయం చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ముంపులో సర్వం కోల్పోయిన వారికి రేషన్ పంపిణీ చేశారని చెబుతున్నారు. రూరల్‌ గ్రామాలకు రెండు వారాల పాటు రాకపోకలు లేకపోవడంతో  ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. 

విజయవాడ నగరంలో భాగమైన రూరల్ గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. వెలగలేరు మొదలుకుని అంబాపురం వరకు ఉన్న గ్రామాలన్నీ విజయవాడ మీదే ఆధారపడి ఉంటాయి. శివారు గ్రామాలు కావడంతో పెద్ద ఎత్తున ఈ గ్రామాల్లో ప్రజలు నివాసం ఉంటున్నారు. వరద ముంపులో చిక్కుకున్న గ్రామాలకు నేటికి రాకపోకలు పునరుద్ధరణ కాలేదు.

జక్కంపూడి ప్రధాన మార్గంలో రోడ్డుపై చేరిన వరద నీరు 15వ రోజు కూడా అలాగే ఉంది. పోలవరం కుడి కాలువ రిటైనింగ్‌ వాల్‌కు, జక్కంపూడి కొండకు మధ్యలో ఉన్న గ్రామం మొత్తం నీటి ముంపులోనే ఉండిపోయింది. రోడ్డుపై మూడు అడుగుల లోతులో నీరు ప్రవహిస్తోంది. పోలవరం కాల్వలోకి నీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో వరద ముంపు అలాగే ఉండిపోయింది.

భారీగా ఆస్తి నష్టం....

వరద హెచ్చరికలు ఏమాత్రం లేకపోవడంతో విజయవాడ రూరల్ మండలంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 31వ తేదీ సాయంత్రానికి బుడమేరు వరద వస్తుందని ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేసినా అందుకు తగ్గట్టుగా రెవిన్యూ, విజయవాడ కార్పొరేషన్‌ అధికారులు స్పందించలేదు. 1వ తేదీ అర్థరాత్రి రూరల్ మండల గ్రామాలను వరద ముంచెత్తింది.

విజయవాడ పాతబస్తీ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే ఈ గ్రామాలను పోలీసులకు కూడా నిర్లక్ష్యం చేశారు. 12 అడుగుల ఎత్తున బుడమేరు ముంచెత్తడంతో జనం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ వరద ప్రవాహం విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలకు చేరుకోడానికి గంటల సమయం పట్టింది.

బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్, ఇందిరా నాయక్‌ నగర్‌, ఆంధ్రప్రభ కాలనీ, కొత్తగా వెలసిన అంబాపురం పంచాయితీ పరిధిలోని కాలనీలకు వరద ముంచుకొస్తోందనే సమాచారమే ప్రభుత్వం నుంచి చేరలేదు. అజిత్‌ సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో 31వ తేదీ సాయంత్రం వరద రావొచ్చనే హెచ్చరికలు మాత్రమే చెప్పారని, ఇళ్లలోకి వరద వస్తుందనే సమాచారం లేకపోవడంతో సర్వం కోల్పోయామని బాధితులు చెబుతున్నారు.దీంతో కట్టుబట్టలతో మిగిలామని, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెబితే జాగ్రత్త పడేవారిమని బాధితులు వాపోతున్నారు.

వరద ముంపులోనే కర్మాగారాలు
వరద ముంపులోనే కర్మాగారాలు

నిలువెల్లా నిర్లక్ష్యం...

వరద ముప్పును నివారించడంలో అధికార యంత్రాంగం ఘోర వైఫల్యమే భారీ నష్టానికి కారణమైంది. 31వ తేదీ వరదల్లో చిక్కుకున్న అంబాపురం గ్రామం నుంచి బయటకు వచ్చేందుకు ప్రైవేట్‌ పడవల్ని ఆశ్రయించి ప్రమాదానికి గురైనట్టు స్థానికులు చెప్పారు.

20-25మంది ఒకే పడవలో ఎక్కడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో పడవ బొల్తా పడి పలువురు గల్లంతైనట్టు అంబాపురం గ్రామస్తులు చెబుతున్నారు. వీరిలో ఓ మహిళతో పాటు చిట్టినగర్‌కు చెదంిన తండ్రి కుమారులు ఉన్నారని ఆ విషయంల వెలుగు చూడలేదని తెలిపారు.

సెప్టెంబర్ 1వ తేదీ అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఒక్కసారిగా వరద నీరు చుట్టుమట్టడంతో కొత్తూరు తాడేపల్లి ప్రధాన రోడ్డులో ఉంటున్న పలు కర్మాగారాల్లో పనిచేసే బీహార్ కార్మికులు తలో దిక్కుకు పారిపోయారు. కొందరు వరదల్లో కొట్టుకుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. వరద వచ్చిన తర్వాత మంగళవారం వరకు తమ వైపు అధికారులు ఎవరు చూడలేదని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం విజయవాడ నగరంలో చేపట్టిన వరద సహాయక చర్యల్లో ఒక్కవంతు కూడా గ్రామీణ ప్రాంతాలకు అందించలేదని చెబుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ చేపట్టిన సహాయక చర్యల్ని నగరానికి పరిమితం చేయడంతో పక్షం రోజుల తర్వాత కూడా రూరల్ గ్రామాల్లో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణానదికి ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుడంటంతో లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించిన యంత్రాంగం బుడమేరు ముప్పును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కార్పొరేషన్‌, రెవిన్యూ అధికారులు ఇరిగేషన్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఈ విపత్తుకు అసలు కారణమనే ఆరోపణలు ఉన్నాయి.